2013 చట్టం ప్రకారం పరిహారమివ్వాలి

వంశధార రిజర్వాయర్‌లో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం, ప్యాకేజీ అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారానికి 23వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి నిర్వాసితులు ఐక్యంగా పోరాడాలన్నారు. నిర్వాసిత గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతకు యూత్‌ ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడుతోందని, ఒక్కో నిర్వాసితునికి ఒక్కో ప్యాకేజీ అమలు చేయడం సరికాదని సూచించారు. పోలవరం ప్రాజెక్టు మాదిరిగానే వంశధార నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వంశధార నిర్వాసితుల సంఘం నాయకులు గంగరాపు సింహాచలం, జి.సూర్యనారాయణ పాల్గొన్నారు.