స్పష్టతలేని భూ కేటాయింపులు

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. తుళ్లూరును రాజధాని ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం పలు హామీలిచ్చింది. అయితే అమలులో మాత్రం చతికిలపడింది. భూములిచ్చిన రైతులకు పరిహారం ప్యాకేజి కింద అభివృద్ధి చేసిన భూములను ఎక్కడ కేటాయిస్తారనేది ఇప్పటికీ స్పష్టతివ్వలేదు. భూమిలేని నిరుపేదలకు పింఛను ఇస్తామన్నారు. 23,500 మంది నిరుపేదలున్నట్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం తరువాత వివిధ రూపాల్లో వడపోత చేపట్టి గురువారం వరకూ 13,019 మందికి ఫించన్లు అందించింది. ఇంకా దాదాపు నాలుగు వేల వరకూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 
ప్రజలకు ప్రధానంగా ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఇంతవరకూ మార్గదర్శకాలు వెలువడలేదు. గ్రామాల్లో వృద్ధులకు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామని, పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించేందుకు 'అన్న క్యాంటిన్లు' ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ హామీలూ అమలు రూపు దాల్చలేదు. వ్యవసాయ విచ్ఛిన్నం వల్ల ఉపాధి కోల్పోయిన దాదాపు 30 వేల మందికి 365 రోజుల పాటు ఉపాధి హామీ అమలు చేస్తామన్నా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అటవీశాఖ ద్వారా మాత్రమే మొక్కలు పెంపకానికి, గ్రామాల్లో సాధారణ పనుల కోసం ఇప్పటి వరకూ 1980 మందినే ఎంపిక చేశారు. మొత్తం ఐదు వేల మందికి ఉపాధి కల్పించేందుకు వీలుగా చేపట్టిన ప్రణాళికా కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణ వ్యవస్థలో అమలు చేయాల్సిన ఈ పథకం వ్యవసాయం ఉపసంహరణ వల్ల ఈ గ్రామాల్లో సాధ్యం కావడం లేదని అధికారులు చెపుతున్నారు. నిరుద్యోగులకు నైపుణ్య సంస్థల ద్వారా శిక్షణ కల్పించి శాశ్వత ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు. విద్యార్హతలతో సంబంధం లేకుండా శిక్షణ కోసం 24 వేల మందిని గుర్తించినా అందులో ఆరు వేల మందినే అర్హులుగా తేల్చారు. వీరిలో 1,400 మంది శిక్షణ కోసం ముందుకొచ్చారు. అయినా ఇప్పటి వరకూ 250 మందినే శిక్షణకు ఎంపిక చేశారు. అలాగే సాధారణ రైతులతో పాటు అసైన్డ్‌, సీలింగ్‌ భూముల వారికి ప్యాకేజీ ప్రకటించారు. ఇప్పటి వరకూ 2,040 ఎకరాలకు గాను 938 ఎకరాలకు మాత్రమే అసైన్డ్‌ రైతులకు పరిహారం ఇచ్చారు. మిగతా భూములపై వివాదాలు ఉన్నాయంటున్నారు. లంక గ్రామాల్లో ఉన్న భూముల రైతులకు పరిహారంపై ఇంకా స్పష్టత రాలేదు. లంక గ్రామాల్లో మొత్తం 2,284 ఎకరాలుండగా అందులో 1,021 ఎకరాలు ప్రభుత్వ భూములుండగా మిగతా 1,263 ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్నారు. వీటికి పరిహారంపై సందిగ్ధత నెలకొంది. భూ సమీకరణలో 99 శాతం భూములిచ్చిన ఐదు గ్రామాలకు ప్రత్యేక ప్యాకేజి కింద రూ. 1.20 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నా ఆ ఊసే లేదు. ఇలా ప్రభుత్వం గతంలో రైతులకు, రాజధాని వాసులకు ఇచ్చిన హామీల అమలుపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదని స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో సిఆర్‌డిఎ ఉపాధ్యక్షులు, మునిసిపల్‌ మంత్రి పి.నారాయణ మాత్రం మొత్తం 90 శాతం హామీలు అమలు చేశామని చెబుతుండడం గమనార్హం.