విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఎఎన్‌-32 ప్రమాద దుర్ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాలను పరామర్శించారు. తొలుత బుచ్చిరాజుపాలెంకు చెందిన నమ్మి చిన్నారావు, లక్ష్మీనగర్‌కు చెందిన నాగేంద్ర కుటుంబ సభ్యులను కలుసుకుని ఓదార్చారు. అనంతరం అక్కడ నుంచి వేపగుంటలోని గంట్ల శ్రీనివాసరావు, అప్పన్నపాలెంలోని సాంబమూర్తి ఇళ్లకు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి మనోధైర్యం కలిగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగి ఐదు రోజులైందని, గాలింపు చర్యలను నేవీ బృందాలు ముమ్మరం చేశాయని తెలిపారు. విమాన అదృశ్య ప్రమాదంలో 29 మంది చిక్కుకోవడం అత్యంత దురదృష్టకరమైన సంఘటనని ఆవేదన చెందారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఎఎన్‌ 32 విమానాన్ని 1984 సంవత్సరంలో కొన్నారని, ఇది అత్యంత శక్తివంతమైనదే అయినా ఉపయోగించాల్సిన కాలం కంటే ఎక్కువగా ఉపయోగించారన్న వ్యాఖ్యానాలు, వార్తలు వస్తున్నాయన్నారు. సాంకేతిక లోపమా? నిర్వహణా లోపమా? ఉపయోగించాల్సిన దాని కంటే ఎక్కువ కాలం ఉపయోగించారా? అన్న విషయాలపై దర్యాప్తు చేయాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని ఆయన డిమాండ్‌ చేశారు.