రైవాడ నీటిని విశాఖకు తరలిస్తే ఊరుకోం

               విశాఖలో మంచినీటి వ్యాపారం కోసం రైతుల పొట్టగొట్టి రైవాడ నుంచి అదనంగా 150 క్యూసెక్కుల నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకొనేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న హెచ్చరించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో రైతులతో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైవాడ నుంచి విశాఖకు అదనంగా నీటిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రైవాడ నీటిని రైతులకే పూర్తిగా అందిస్తామని, రిజర్వాయర్‌ను రైతులకు అంకితం చేస్తామని అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, అదనంగా నీటిని తరలించుకుపోవడానికి నిర్ణచయించడం దారుణమన్నారు. ఒక పక్క అదనపు ఆయకట్టు 6 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని రైవాడ కాలువ పరీవాహక ప్రాంత రైతులు ఉద్యమాలు చేస్తుంటే, అసలైన ఆయకట్టుదారులకు సాగునీరు అందించకుండా రైతుల గొంతుకోసి, విశాఖకు నీటిని తరలించుకుపోవడం దారుణమని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు ప్రకటనలకు పరిమితమై ఇంట్లో కూర్చోవడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. పోలవరం కాలువ పూర్తవుతుందని, సుజల స్రవంతికి నిధులు కేటాయించి విశాఖకు నీరు తీసుకొచ్చి, రైవాడను రైతులకు పూర్తిగా వదిలిపెడతామని చెప్పిన పాలకులు ఆ దిశగా ఎటువంటి పనులు జరగడం లేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లు కేటాయించడం సిగ్గు చేటన్నారు. రైవాడ ఆయకట్టు రైతులందరూ రాజకీయాలకు అతీతంగా కలసికట్టుగా ఉద్యమం చేపట్టాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానించారు.