రియల్‌ఎనర్జీకు దోచిపెడితే ఊరుకోం..

ఒప్పంద కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా రియల్‌ ఎనర్జీ సంస్థకు నగర పాలక సంస్థ డబ్బులు చెల్లించడం విడ్డూరంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ 30తో గడువు ముగిసినా కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ఏకపక్షంగా ఒప్పంద కాలపరిమితిని పొడిగించారని విమర్శించారు. అధికార టిడిపి ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిడితో అడ్డగోలుగా కోట్లాది రూపాయలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.  విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 41 శాతం మేర విద్యుత్‌ ఆదా చేసేందుకు 2014 ఆగస్టు 14వ తేదీ వరకూ వీధిలైట్ల నిర్వహణ రియల్‌ ఎనర్జీ సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకుందని, కానీ ఆ రీతిలో విద్యుత్‌ ఆదా చేయలేదని తెలిపారు. అయినా 2007 నుండి ఐదేళ్లపాటు అడ్దగోలుగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని రియల్‌ ఎనర్జీ సంస్థకు కార్పొరేషన్‌ ముట్టజెప్పిందన్నారు.