మరోమారు మాట తప్పిన ప్రభుత్వం..

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వ మరోసారి మాట తప్పింది. వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో పొలాలున్న రైతులకు కోరిన రెవెన్యూలో ఒకేచోట స్థలం కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం అటువంటిదేమీ లేదని ప్రకటించింది. కుటుంబంలో ఒకే గ్రామ పరిధిలో వేర్వేరు పేర్ల మీద ప్లాట్లు ఇచ్చిన యజమానులు ఒకే చోట భూములు కావాలనుకుంటే ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. జనవరి రెండోతేదీన నేలపాడులో పూలింగు ప్రక్రియ ప్రారంభించారు. అప్పట్లో వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో భూములున్న రైతులు తమకు ఒకేచోట భూములు కావాలని కోరారు. దీనికి మంత్రులు అంగీకరించారు. వేర్వేరు చోట్ల భూములున్న వారందరూ తహశీల్దార్‌కు తమ అంగీకార పత్రాలు సమర్పించాలని, వారందరికీ కోరుకున్న రెవెన్యూలో భూములు కేటాయిస్తామని మంత్రులు నారాయణ, పుల్లారావు, రావెల కిషోర్‌, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రకటించారు. ప్రతి గ్రామంలోనూ ఇదే ప్రకటన చేశారు. దీంతో రైతులు సంబరపడిపోయారు. పూలింగు కింద భూములిచ్చిన వారిలో సుమారు 30 శాతం మందికి వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో పొలాలున్నాయి. వారిలో ఎక్కువ మంది భూములివ్వలేదు. ఒకేచోట ఇస్తామని హామీనిస్తే పూలింగుకిస్తామని ప్రకటించారు. దీనికి మంత్రులు, సిఆర్‌డిఏ అధికారులు అంగీకరించడంతో భూములిచ్చేశారు. 2016 ఏప్రిల్‌ నాటికి భూములు కేటాయించాల్సి ఉండటంతో ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో భూములున్నవారికి ఒకే రెవెన్యూలో ప్లాట్లు కేటాయించడం కుదరదని తేల్చి చెప్పారు.