భూసేకరణకు నిరసనగా రేపు CRDA వద్ద ధర్నా:AIAWU

రాజధాని గ్రామాల్లో భూ సమీకరణకు ఒప్పుకోని రైతుల భూములను భూ సేకరణ చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవాలనే ఉత్తర్వులను ఉప సంహరించాలని అఖిలపక్ష రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భూ సేకరణకు నిరసనగా శుక్రవారం క్రిడా కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ నెల 20 నుంచి భూసేకరణ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనను సమావేశం ఖండించింది. బలవంతపు భూసేకరణ ప్రయత్నాలను మానుకోవాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్‌ చేశారు. భూ సమీకరణకు తమ భూములు ఇవ్వబోమని 8 వేల ఎకరాల రైతులు 9.2 అభ్యంతర పత్రాలను అధికారులకు అందజేశారని, నిబంధనల ప్రకారం 15 రోజుల్లోపు క్రిడా అధికారులు సమాధానం ఇవ్వాల్సివున్నా ఇవ్వ లేదన్నారు. భూమి లేని పేదలకు ఇస్తామని చెప్పిన రూ.2500 పెన్షన్‌ కూడా చెల్లించలేదన్నారు. వీరికి పెన్షన్‌ నెలకు రూ.9వేలు పెంచుతూ జీవో జారీ చేసి, వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు..