పెరిగిన నిత్యావసరాలతో ప్రజల ఇబ్బందులు :సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు

నవ్యాంధ్ర రాజధానిలో భూములు కోల్పోయిన రైతుల ఇబ్బందులు ఒక పక్క, ప్రభుత్వ రాజధాని నిర్మాణం ఆడంబరం మరోపక్క, పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు ఇంకోపక్క ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తాడేపల్లి లో నిర్వహించిన సిపిఎం నాయకులు మేకా అమరారెడ్డి 34వ వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. సభకు సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటే శ్వరరావు అధ్యక్షత వహించారు. బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా 4వేల ఎకరాల్లో వచ్చే పదేళ్లలో రాజధాని నిర్మాణం చేస్తానని చెబుతున్న నేపథ్యంలో రైతుల నుండి 33వేల ఎకరాలు సేకరించి మొత్తం లక్ష ఎకరాలు భూములు సేకరించడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రైతులతో మైండ్‌గేమ్‌ ఆడటానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. తాజాగా మంత్రి పత్తిపాటి పుల్లారావు ఉండవల్లి రైతులు రాజధాని నిర్మాణానికి భూములిస్తున్నారని చేసిన ప్రకటన అటువంటిదేనని చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని లో సమస్యలపై ప్రశ్నించడానికి, బతకడానికి, హక్కుల కోసం అడగడానికి అవకాశం లేకుం డా పోలీసు చట్టాన్ని ఉపయోగి స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మొదటి నుండి కోరుతున్నట్లు ప్రజా రాజధాని కావాలని, కార్పొరేట్‌ రాజధాని వద్దని సూచించారు. రాజధాని నిర్మాణంలో ఏఏ కంపెనీలు ఎంతెంత పంచుకుంటున్నాయో దాగిఉన్న కుట్రను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌చేశారు. పెద్దలకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం బీదలకు మాత్రం భారాలమీద భారాలు వేస్తున్నాయని మండిపడ్డారు. తాడేపల్లి ప్రాంతంలో మేకా అమరారెడ్డిలాంటి నాయకులు త్యాగాలతో పార్టీ నేడు ఈ స్థితికి వచ్చిందన్నారు. ఉద్యమాన్ని నిలబెట్టుకోవడంలో అనేక ఒడిదుడుకులు, ఆటుపోట్లను తట్టుకొని కార్యకర్తలు ముందుకు సాగుతున్న కృషిని ప్రశంసిం చారు. పేదలకోసం పనిచే స్తున్నారని కక్షతో ఈ ప్రాంతంలో అమరా రడ్డి, బండారుముత్యాలు, మాలకొండారెడ్డి లాంటి నాయకులను అరాచకశక్తులు పొట్టనపెట్టుకున్నాయని విమర్శించారు.