పునరావాసం తరువాతే ప్రాజెక్టు పనులు

       వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం, పరిహారం కల్పించిన తరువాతే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా, వారిని రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదని హితవు పలికాయి. నిర్వాసితుల డిమాండ్లు న్యాయమైనవనీ, వారు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపాయి. ఆదివారం స్థానిక క్రాంతిభవన్‌లో చౌదరి తేజేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ, లోక్‌సత్తా, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ, వైసిపి పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి క్రిష్ణమూర్తి మాట్లాడుతూ 2005లో వంశధార ప్రాజెక్టును ప్రారంభించినా, నేటికీ పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదన్నారు. ఏ ప్రాజెక్టులోనైనా మొదటి ప్రాధాన్యత నిర్వాసితులకే ఇవ్వాలని చట్టాలు, సుప్రీం కోర్టు చెప్తున్నాయని తెలిపారు. అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ఇవ్వడం దారుణమన్నారు. హిరమండలం మండలం తులగాం గ్రామస్తులకు పంటలు వేయొద్దని ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌అర్‌ ప్యాకేజీ పూర్తయినంత వరకూ నిర్వాసితులు ఎవరి భూముల్లో వారు వ్యవసాయం చేసుకునే హక్కు ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వాసితులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు.
సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ మాట్లాడుతూ వంశధార నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల పునరావాసం, పరిహారం చెల్లింపుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ మాట్లాడుతూ నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందన్నారు. నిర్వాసితులను రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని హితవు పలికారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించే వరకూ వారి ఉద్యమంలో భాగస్వామ్యమవుతామని ప్రకటించారు.
లోక్‌సతాపార్టీ జిల్లా అధ్యక్షులు కె.పోలినాయుడు మాట్లాడుతూ ప్రాజెక్టులు అవసరమని, అయితే రైతులను బలవంతంగా భూముల నుంచి వెళ్లగొట్టడం సరికాదన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం నెలరోజులకు పైగా నిర్వాసితులు రిలేనిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. నిర్వాసితుల విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని బలవంతంగా వెళ్లగొట్టించడాన్ని పార్టీ తరుపున ఖండిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రత్నాల నరసింహమూర్తి మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. పునరావాసం, పరిహారం చెల్లించాలని కోరుతున్న రైతులను అక్రమంగా నిర్బంధానికి గురిచేయడం ద్వారా ఒక వ్యూహాత్మకంగా ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
వైసిపి ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.జీవరత్నం మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.