పీఆర్‌సీ చెల్లింపులలో దోపిడీ

రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ ప్రకటించిందని ఉద్యోగులు సందడి చేసుకుంటుంటే... ఆ చెల్లింపుల మాటున ట్రెజరీ ఉద్యోగులు పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశారు. ప్రతి ఉద్యోగి నుంచీ అధికారికంగా రూ. 500 మామూళ్లు వసూ లు చేస్తున్నారు. ‘ప్రభుత్వం పదో పీఆర్‌సీలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు ఉద్యోగుల బేసిక్‌ రెట్టింపు అవుతుంది. అటువంటప్పుడు మాకు రూ.500 ఇవ్వడం పెద్ద లెక్క కాదు’ అని ట్రెజరీ ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కొత్త కాదని, ప్రతి కొత్త పీఆర్‌సీకి ఈ తరహా ప్రత్యేక బాదుడు మామూలేనని ఉద్యోగులు వాపోతున్నారు. ఏ శాఖ ఉన్నతాధికారి తమ శాఖ పరిధిలోని ఉద్యోగులకు కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాన్ని సవరించి పే ఫిక్సేషన్‌ బిల్లులను ట్రెజరీకి పంపుతారు. ట్రెజరీ ఉద్యోగులు వాటిని పరిశీలించి ఏమైన లోపాలు ఉంటే సరి చేసి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ తతంగం కోసం ట్రెజరీ ఉద్యోగులు లంచాల రూపంలో రూ. కోట్లు గుంజుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో సుమారు మూడున్నర లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరు రూ.500 ఇస్తే సుమారు 17.50 కోట్లు అవుతుంది. గుంటూరు జిల్లాలోనే సుమారు 50వేల మంది ఉద్యోగులు ఉండగా... వారి నుంచి మామూళ్ల రూపంలో ట్రెజరీ ఉద్యోగులు సుమారు రూ.2.5 కోట్లను దోచుకుంటున్నారు.