తొలివిడతలో 5 గ్రామాల్లో 11 ఎకరాల భూసేకరణ..

రాజధాని ప్రాంతంలో భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంతవరకు యూనిట్‌ అధికారులగా ఉన్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను, ల్యాండ్‌ అక్విజిషన్‌ అధికారులుగా మారుస్తూ 304 నెంబరుతో జిఓ జారీ అయింది. 9.2 అభ్యంతర పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రేపటి నుండి నోటిఫికేషన్లు ఇవ్వనుంది. వీటిని ఆయా కార్యాలయాల పరిధిలో బహిరంగంగా ఏర్పాటు చేస్తారు. వీటిపై అభిప్రాయాలు చెప్పుకునేందుకు వారం రోజులు గడువిచ్చారు. వాటిని కూడా పరిష్కరించిన అనంతరం గ్రామాలవారీగా సేకరణ నోటిఫికేషన్‌ ఇస్తామని సిఆర్‌డిఎ అధికారులు చెప్పారు. అయితే గురువారం రాత్రి తొలి విడత నోటిఫికేషన్‌ విడుదలైంది. తుళ్లూరు మండలంలోని పిచ్చుకలపాలెం, అబ్బరాజపాలెం, బోరుపాలెం, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో 11 ఎకరాల సేకరణకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అంతకుముందు 26 యూనిట్ల పరిధిలో ఉన్న ఎస్‌డిసిలకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారు గ్రామాల వారీగా సమీకరణ కింద రాని భూములతో పాటు, అభ్యంతరాలను వ్యక్తం చేసిన రైతుల భూములతో కూడిన జాబితాలను సిద్ధం చేసి పెట్టారు. అన్ని గ్రామాల్లోనూ దాదాపుగా 90 శాతం భూమి పూలింగు ప్రక్రియలో వచ్చిన నేపథ్యంలో అభ్యంతరాలను తిరస్కరించాలని నిర్ణయించింది. ఇదంతా గురువారం పూర్తి చేశారు. శుక్రవారం నుండి 9.2 నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. వచ్చేనెల మొదటి వారం నుండి సేకరణ ప్రక్రియ మొదలవు తుందని అధికారులు తెలిపారు. దీని కింద సుమా రు 2800 ఎకరాలు సేకరించ నున్నారు. తొలి దశలో సీడ్‌ డెవలప్‌మెంట్‌ గ్రామాల పరిధిలో సేకరించాలని నిర్ణయించారు. 9,2 అభ్యంతరాల పరిశీలన పూర్తయిన వెంటనే వాటినీ కలిపి సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. రాజధానిలో 35,394.18 ఎకరాల పట్టాభూమిని సమీకరిం చాల్సి ఉండగా గురువారం వరకు 26,874.81 ఎకరాలను సమీకరించింది.