ఒప్పందాలన్నీ విదేశీ కంపెనీలకే..

రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకుగానీ, దానికి సాంకేతిక సలహా ఇచ్చేందుకుగానీ చేసుకున్న ఒప్పందాలన్నీ విదేశీ కంపెనీలకే చెందినవి కావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం మొత్తం మాస్టర్‌ డెవలపర్‌పేరుతో సింగపూర్‌కు కట్టబెట్టగా, రాష్ట్రంలో కోస్తాతీరంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులను జపాన్‌కు అప్పగిస్తోంది. పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు బాధ్యతతో పాటు అత్యంత కీలకమైన విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటునూ జపాన్‌కు అప్పగించింది. దీంతోపాటు వ్యవసాయంలో ఆధునీకరణకు జపాన్‌ సాయం తీసుకోనుంది. ఇది ఆందోళన కలిగించే అంశమని మాజీమంత్రి, వ్యవసాయరంగ నిపుణులు వడ్డే శోభనాద్రీశ్వరరావు చెబుతున్నారు. ఆయన తొలినుండీ విదేశీ కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్‌ ప్లాంట్లను ప్రభుత్వపరంగా ఏర్పాటుచేస్తే ఇబ్బందిలేదని, దేశంలో ఉన్న ప్రైవేటు విద్యుత్‌ ప్లాంట్లతోనే తలనొప్పి వస్తుంటే కొత్తగా జపాన్‌ కంపెనీల అవసరం ఏమొచ్చిందని ఇరిగేషన్‌ నిపుణులు అక్కినేని భవానీప్రసాద్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆ పేరుతో భూములు విదేశీయుల చేతుల్లోకి దీర్ఘకాలం లీజులోకి వెళుతున్నాయని, ఇది ప్రమాదకరమని సిపిఎం నాయకులు సిహెచ్‌. బాబూరావు హెచ్చరి స్తున్నారు..