ఇదేనా మహిళోద్ధరణ అంటే..

విదేశీ పెట్టుబడిదారులతో దేశం అధోగతిపడుతోందని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి సింగపూర్‌, జపాన్‌ల వంటి వలస పాలన అవసరం లేదని ధ్వజమెత్తారు. సొంత వనరులపై ఆధారపడి ప్రభుత్వాలు పాలన సాగించాలని ఆయన సూచించారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ˜ీ, మద్య నియంత్రణ అంశాలపై శుక్రవారం ఇక్కడ మహిళా సంఘాల రాష్ట్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి. జయలక్ష్మి అధ్యక్షత వహించారు. సదస్సులో మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించినట్లుగా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ న్యాయ సమ్మతమేనన్నారు. మహిళల ఉద్దరణ కోసమే పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారనే సంగతి పాలకులు మరచిపోకూడదని హితవు పలికారు. మహిళలపై వివక్ష చూపుతున్న మోస పూరిత, దుర్మార్గపు ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి మహిళలు చేపట్టే ఉద్యమం నాంది పలకాలన్నారు. మహిళల స్వావలంబన కోసం ఇసుక క్వారీల్లో వ్యాపారాలు నిర్వహించాలని చెప్పిన చంద్రబాబు చివరికి మొండిచెయ్యి చూపారని ఎద్దేవా చేశారు. ఇసుకరీచ్‌ల్లో టీడీపీ నాయకులే డబ్బులు మింగుతు న్నారని విమర్శించారు. ముందు ప్రకటించినట్లుగా ఇసుక నికర ఆదాయాల్లో మహిళలకు 25 శాతం ఇవ్వాలని మధు డిమాండ్‌ చేశారు.