అధిక ధరలపై గళమెత్తిన వామపక్షాలు

పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా వామపక్షాలు నిరసన గళమెత్తాయి. ధరలను నియంత్రించకపొతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని, ప్రజాప్రతిఘటన తప్పదని హెచ్చారించాయి. రాష్ట్ర వ్యాపితంగా అధిక ధరలకు నిరసనగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు సోమవారం జిల్లా వ్యాపితంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్‌ నుండి అంబేద్కర్‌ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్‌డిఎ, రాష్ట్రంలో టిడిపిలు ఎన్నికల ముందు వంద రోజుల్లో ధరలు నియంత్రిస్తామని ప్రగల్బాలు పలికి, నేడు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోవట్లేదన్నారు. కందిపప్పు, బియ్యం, చింతపండు, ఉల్లిపాయలు, మినపుగుళ్ళు, కూరగాయల ధరలు నింగి నంటుతున్నాయని, మరోవైపు వర్షాభావ కారణంతో జిల్లాలో పంటలు ఎండిపొయే పరిస్థితి వచ్చిందని, రైతాంగం అత్మహాత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ పరిస్థితిలో ధరలు పెంచడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరికరణ నిధిని ఏర్పాటు చేయాలని, బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని కొరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని చుట్టూ తిరుగుతూ ప్రజానికానికి అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించక పొతే బిహార్‌ ఎన్నికల్లో బిజెపికి పట్టినగతే దేశవ్యాపితంగా బిజెపికి, రాష్ట్రంలో టిడిపికి పడుతుందని హెచ్చరించారు.