సెప్టెంబరు 2 సమ్మె అనివార్యం..

ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ 2016 సెప్టెంబర్‌ 2న ఒక రోజు దేశవ్యాప్త సమ్మె నిర్వ హించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. బియంయస్‌ మినహా మిగిలిన కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సమ్మె ఎందుకు జరుగుతుందో పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకరణ ఆర్థిక విధానాలను తీవ్రంగా అమలు చేస్తున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో ప్రజలచే ఛీత్క రించబడిన ఈ విధానాలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కేంద్ర బిజెపి ప్రభుత్వం మరింత వేగంగా అమలుజేయ డానికి పూనుకోవడం వల్ల దేశంలో పెట్టుబడిదారులకు మంచిరోజులు వచ్చాయి. సాధారణ ప్రజలకు, ఉద్యోగ, కార్మికులకు మరింత గడ్డురోజులు దాపురించాయి.
దూకుడుగా ముందుకెళ్తున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగం, రైల్వేలతో సహా అన్ని కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నూరు శాతం వరకూ అనుమతించడం, లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రయివేటీకరించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవడం, కార్మిక సంస్కరణల పేరిట కార్మిక చట్టాలన్నింటినీ కుదించి కార్మికుల హక్కులను అణచివేయడం లాంటి చర్యలు కార్మికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌ 2న 15 కోట్ల మంది కార్మికులు విజయవంతంగా సమ్మె నిర్వహించి మోడీ సర్కార్‌ విధానాల పట్ల తమ తీవ్ర నిరసనను తెలిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఉద్యోగ, కార్మిక సంఘాలు సమర్పించిన 12 కోర్కెలతో కూడిన వినతిపత్రం విషయంలో సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందానికి వస్తామని కేంద్ర ప్రభుత్వం ఆనాడు నమ్మబలికింది. అయితే ఒక్కసారి కూడా కార్మిక సంఘాలతో చర్చలు గానీ, సంయుక్త సమావేశాలు గానీ జరపలేదు. తాము కుదించదలుచుకున్న కార్మిక చట్టాల విషయంలో పునరాలోచనే లేదని కేంద్ర కార్మిక శాఖా మంత్రి పదేపదే ప్రకటిస్తున్నారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌ను అదుపుచేయడం, సమ్మెలను నిషేధించడం, కార్మికులను ఇష్టానుసారం తొలగించడం లాంటి దుర్మార్గమైన క్లాజులను కొత్త చట్టంలో పొందుపరిచారు. కనీస వేతనం రూ.18,000, బ్యాంకులు, ఇన్సూరెన్సులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, బలవంతపు భూ సేకరణ రద్దు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆంక్షలు, పిఎఫ్‌, పెన్షన్‌, ఆరోగ్య సౌకర్యాలతో కూడిన అసంఘటితరంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం, తదితర సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో కార్మికులు ఆగ్రహంతో ఈ సమ్మెలో భాగస్వాములవుతున్నారు.
గతం నుంచి పాఠాలు నేర్వని చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం కంటే మరింత దూకుడుగా చంద్రబాబు ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రతి సందర్భంలోనూ వ్యవహరిస్తోంది. 2015 మార్చిలో రాష్ట్రంలోని ఐదు ప్రధాన కార్మిక చట్టాలను ఏకపక్షంగా సవరిస్తూ ప్రభుత్వం శాసనసభ ద్వారా బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది. దీనితో గతంలోవున్న అనేక హక్కులను కార్మికులు కోల్పోయారు. అదే సమయంలో కార్మిక చట్టాలను అమలు చేయకుండా తప్పించుకునే అవకాశాన్ని యజమానులకు కల్పించారు. విశాఖ జిల్లా బ్రాండిక్స్‌, అనంతపురం జిల్లా రావతార్‌, నెల్లూరులో కృష్ణపట్నం ఓడరేవు, శ్రీకాళహస్తిలోని ల్యాంకో, శ్రీకాకుళంలోని అరబిందో, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని సిమెంటు ఫ్యాక్టరీ, తదితర పరిశ్రమల్లో కార్మికులపై, కార్మికసంఘాలపై జరుగుతున్న దాడులకు, పగసాధింపు చర్యలకు స్ఫూర్తి ఇక్కడి నుంచే వస్తున్నది. విజయవాడ నగరంలో కార్మిక సంఘాలు శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు. ధర్నాల్లో పాల్గొంటే ఉద్యోగాల నుంచి తొలగించే విధంగా స్కీం వర్కర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఈ ప్రభుత్వ నిరంకుశ విధానానికి పరాకాష్ట.
రాష్ట్రంలో 65 కనీస వేతనాల షెడ్యూళ్లలో సుమారుగా 40-50 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. ధరల పెరుగుదలను బట్టి ఐదు సంవత్సరాలకొకసారి వారి వేతనాలను సవరించడం ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత. అయితే ఈ 65 షెడ్యూళ్లలో సుమారు 54 షెడ్యూళ్లు కాలపరిమితిని ఎప్పుడో దాటిపోయాయి. అత్యధిక షెడ్యూళ్లు నాలుగైదు సంవత్సరాలుగా వేతన సవరణ కోసం వేచి చూస్తున్నాయి. అంటే పది సంవత్సరాల క్రిందటి వేతనాల తోనే నేటికీ కార్మికులు పనిచేయవలసి వస్తున్నది. కనీస వేతనాల సలహా బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ కమిషనర్‌ పంపిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ఆఫీసులో పడి ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికై వసూలు చేసిన సెస్సును తమ రాజకీయ ప్రచారానికి విచ్చలవిడిగా వాడుకుంటున్నారు.చంద్రన్న చలవ పందిళ్లు, ప్రజలందరికీ వేసవిలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ, మేడే సందర్భంగా పారిశ్రామికవేత్తలకు సన్మానం, ట్రాన్స్‌పోర్టు కార్మికుల బీమా పథకం కొరకు చెల్లించిన ప్రీమియం, చంద్రన్న బీమా పథకం ప్రీమియంతో సహా ప్రభుత్వం తన రాజకీయ ప్రచారానికి చేపడుతున్న అన్ని పథకాలకు భవన నిర్మాణ కార్మికుల సెస్సు నిధిని విచ్చలవిడిగా వాడేసుకోవటం తీవ్రమైన విషయం. బాబు వస్తే జాబు వస్తుందని ఆశించిన యువతకు ఈ పాలన తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అంతేగాక ప్రభుత్వమే తన శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. గృహ నిర్మాణ శాఖలోని వేలాది మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఉపాధి హామీ శాఖలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, స్త్రీశిశు సంక్షేమ శాఖలోని వేలాది మంది చిరుద్యోగులు, ఆరోగ్యమిత్ర, ఐకెపి రంగాల్లో నివే లాది మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోతున్నారు. అంతేకాక వేలాది మంది స్కీం వర్కర్లను ఏ సూత్రం లేకుండా తొలగించి తమ వారిని నియమించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఫెర్రో ఎల్లాయీస్‌, జూట్‌, కోఆపరేటివ్‌ సుగర్స్‌, పేపర్‌, తదితర రంగాల్లో అనేక పరిశ్రమలు మూతబడి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆ పరిశ్రమల పునరుద్ధరణకు గానీ, ఆ పరిశ్రమలలోని వేలాది కార్మికుల హక్కుల పరిరక్షణకు గానీ, కార్మికులకు తగిన నష్టపరిహారం ఇప్పించడానికి కానీ ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు.
ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోని ఉద్యోగులు తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పిఆర్‌సిని అమలు చేయాలని, 60 సంవత్సరాల వయస్సు వరకు పనిచేసే అవకాశాన్ని ఇవ్వమని కోరుతున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. ఈ ఉద్యోగులతో ప్రభుత్వానికి సంబంధం లేదని హైకోర్టులో అధికారికంగా ప్రకటించి తన కార్మిక వ్యతిరేక వైఖరిని స్పష్టం చేసింది. లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఎన్నికల వాగ్దానాల ప్రకారం పర్మినెంట్‌ చేయలేదు. పిఆర్‌సి అమలు చేయలేదు. 279, 26 తదితర జీవోలతో మున్సిపల్‌ కార్మికులు, షాపు ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడిని కల్పించి కార్మికులను వెట్టిచాకిరీ చేసే యంత్రాలుగా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం యజమానుల తొత్తుగా, పెట్టుబడికి ఫెసిలిటేటర్‌గా వ్యవహరించడాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి విదేశీ, స్వదేశీ పెట్టుబడిదార్లకు మాత్రమే సమయం కేటాయించగల స్థితిలో ఉన్నారు. గడచిన రెండేళ్ళ కాలంలో ఏ స్థాయిలోనూ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవా ప్రభుత్వం చూపించలేదు. రాష్ట్రంలో ఉత్పత్తిలో ప్రధాన పాత్రధారులైన కార్మికులతోగాని, కార్మిక సంఘాల ప్రతినిధులతోగాని చర్చించని తొలి ప్రభుత్వంగా మిగిలింది.
అనివార్యమైన సమ్మె
కార్మికులకు సమ్మె సరదా కాదు. అదెంతో కష్టసాధ్యమైన పని. అది తమనెంతో ఇబ్బందులకు గురిచేస్తుందని తెలుసు. కానీ అర్జీలు విఫలమైన చోట, చర్చలకు మార్గాలు మూసుకు పోయిన చోట సమ్మె శంఖారావం పూరించటం తప్ప కార్మికులకు మరో మార్గంలేదు. అందుకే అన్ని మున్సిపల్‌ పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు, మండల కేంద్రాలు, రాష్ట్రవ్యాప్త రంగాలలో సమ్మె జయప్రదం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర జాతా, జిల్లా జాతాలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం సాగుతున్నది. అనుబంధాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఆర్టీసీ, విద్యుత్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, ప్రయివేటు రవాణా, పారిశ్రామిక కార్మికులు, తదితర ఉద్యోగ, కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొనటానికి సిద్ధమవుతున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాలు, ప్రజాతంత్రవాదులు, ప్రజలు ఈ సమ్మెకు మద్దతుగా నిలుస్తున్నారు.
- కారుసాల శ్రీనివాసరావు