CPM రాస్తారోకోలు..

ఉల్లి, కందిపప్పు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. వీటి ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం రాస్తారోకోలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు  పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు, కందిపప్పు ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయని, వాటిని అదుపుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. రైతు బజార్లలో ఉల్లి రూ.20 చొప్పున అమ్మకాన్ని నామ మాత్రం గానే ప్రారంభించారని, వీటికోసం భారీ క్యూలు ఉంటున్నాయని కొందరు మహిళలు సొమ్మసిల్లిపోతు న్నారని వెల్లడించారు. ఈ ఘటనలు మీడియాలో వస్తున్నా సరుకు సరఫరాలకు చర్యలు లేవని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని రేషన్‌ షాపుల్లో ఉల్లిపాయలను 5 కిలోలు, కందిపప్పును 2 కిలోల చొప్పున పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ నిల్వలు వెలికి తీసి, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.