2030 నాటికి పేదరికం కనబడదా?

అవునంటున్నారు పెట్టుబడిదారీ దేశాధి నేతలు. నిజానికి ఆయా దేశాల్లో ప్రభుత్వాధినేతలు రోజూ చెప్పేది అదే. అధికా రంలోకి వచ్చిన వాళ్లు పదవీ కాలంలో తిమ్మిని బమ్మిని చేస్తామని చెబుతుంటారు. అధికారం కోల్పోయిన వాళ్లు తమ కాలంలో దాదాపు పేదరికాన్నే నిర్మూలించినట్లు, తమ అనంతరం అంతా నాశనం అయిపోతున్నట్లు గగ్గోలు పెడు తుంటారు. ఏదిఏమైనా పేదరికం గురించి, పేదరిక నిర్మూలన గురించి జరిగేంత చర్చలో ఒక్క వంతు కూడా పేదరికానికి కారణాల గురించి మాత్రం జరగకుండా పాలక వర్గాలు, పలు పార్టీలు, వారి ఉప్పు తినే మేధావులు జాగ్రత్త పడుతుంటారు.
ఎండిజిల స్థానంలో ఎస్‌డిజిలు
ఎండిజిలు అంటే మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు) 2000 సంవత్సరంలో ఐక్య రాజ్యసమితి చొరవతో 139 దేశాలు సమావేశమై భయా నకంగా పెరుగుతున్న పేదరికం, దానికి సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలపై చర్చలు జరిపాయి. దీన్ని సహస్రాబ్ది శిఖ రాగ్ర సభ అంటారు. ఈ సభ చాలా రోజులు తలలు బద్దలు కొట్టుకుని చివరకు ఎనిమిది సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను రూపొందించింది. ఇందులో మొదటిది పేదరికం గురించి. 1990 నాటికి ఉన్న పేదరికంలో సగాన్ని 2015 నాటికి తగ్గిం చాలి. (పేదరికం అంటే వారి నిర్వచనం, ఆనాటికి రోజుకు ఒక్క డాలరు సంపాదించడం) ఇక సార్వత్రిక ప్రాథమిక విద్య అందరికీ అందించడం, మహిళా సాధికారత సాధించడం, 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు 2015 నాటికి మూడిం ట రెండు వంతులు తగ్గించడం, బాలింతల మరణాలు నాల్గింట మూడు వంతులు తగ్గించడం, ఎయిడ్స్‌/ క్షయ/మలేరియా వంటి వ్యాధులను రూపుమాపడం, పర్యావరణ సమతుల్యాన్ని సాధించడం వగైరా.. వగైరా. ఈ లక్ష్యాలు సాధించడానికి అభివృద్ధి చెందిన బడా పెటు ్టబడిదారీ దేశాలు తమ స్థూల జాతీయాదాయంలో 0.7 శాతం అధికారయుత అభివృద్ధి సహకారంగా అందించాలని ఆ సమావేశంలో తీర్మానించారు. కాలచక్రం గిర్రున తిరిగింది. 2015 రానే వచ్చింది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల కాల పరిమితి ముగిసింది. అనేక విషయాల్లాగానే ఈ ఎమ్‌డిజిల గురించి అందరూ మర్చిపోయారు. పాపం ఐక్యరాజ్యసమితికి మర్చిపోయే స్వేచ్ఛ లేదు. అందువల్ల సమీక్షా సమావేశం జరి గింది. ఈసారి 200 దేశాలు హాజరయ్యాయి. అనుకున్న ఎనిమిది లక్ష్యాలు సాధించబడ్డాయన్న నిర్ణయానికి వచ్చాయి. 2016-30 మధ్య ఈసారి 17 'నిలకడైన అభివృద్ధి లక్ష్యాలు' (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌) సాధించాలని తీర్మా నించాయి. 2015 నాటికి ప్రపంచ పేదరికాన్ని సగానికి తగ్గిం చాలన్న లక్ష్యం సాధించాం కాబట్టి మరో 15 సంవత్సరాల్లో పేదరికం మొత్తాన్ని రూపుమాపాలన్న లక్ష్యాన్ని పెట్టారు. దీనితో పాటు 2030 నాటికి ఆకలిని అంతం చేయడం, తాగునీరు/పారిశుద్ధ్యం అందరికీ అందించడం, అందరికీ ఉపాధి, దేశాల మధ్య అలాగే దేశాలలోని అంతరాలను రూపు మాపడం ఇలా పెట్టుబడిదారీ వ్యవస్థలో అసాధ్యమైన లక్ష్యాలన్నింటినీ ఏకరువు పెట్టొచ్చారు. ఇలా సహస్రాబ్ది లక్ష్యాలు అంతరించి వాటి స్థానంలో 'నిలకడైన అభివృద్ది లక్ష్యాలు' పుట్టుకొచ్చాయి.
అసత్యాలు-అసాధ్యాలు
2000 సంవత్సరంలో ఎనిమిది ఎమ్‌డిజిలు/21 లక్ష్యాలు/60 సూచికలు నిర్ధారించారు. 2015లో 175 డిజిలు/169 లక్ష్యాలు నిర్ధారించారు. సహస్రాబ్ది లక్ష్యాలు (ఎమ్‌డిజి) నిజంగానే నెరవేరాయా? ఇందులో అనేక బూట కాలు ఉన్నాయని మేధావులు అంటున్నారు. ''అసలు 1990 నాటి పేదరికాన్ని ప్రాతిపదికగా తీసుకోవడమే ఒక నాటకం. ఎందుకంటే ఒక డాలరు సంపాదించే వారి సంఖ్యను 15 సంవత్సరాలలో సగానికి కుదించడమనేది పెద్ద సమస్య కాదు. అయితే ఇదైనా జరిగిందా అనేది అసలు సమస్య '' అంటున్నారు సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ ప్రొఫెసర్‌ చార్లెస్‌ కెన్నీ, న్యూయార్క్‌ న్యూస్కూలు ఫ్రొఫెసర్‌ సుజరురెడ్డి వంటివారు. పేదరికం నిర్మూలనలో చైనా మంచి ఫలితాలు సాధించింది కాబట్టి ఈ లెక్కలు కనబడుతున్నాయి. వైఫ ల్యానికి ఈ అంశంలో ప్రధాన కారణం భారతదేశం వెనుకబడి ఉండటమేనని 2014 ఐక్యరాజ్యసమితి నివేదిక చెబు తున్నది. ఐరాస సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ ఒక పక్క సహస్రాబ్ది లక్ష్యాలను ప్రశంసిస్తూనే ''15 సంవత్సరాల తర్వాత (ఎమ్‌డిజిల అమలు) కూడా 5.7 కోట్ల మంది చిన్నా రులు బడిగడప తొక్కలేదన్నారు. 25 కోట్ల మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందడంలేదు. ఇవన్నీ జరగాలంటే జి-7 దేశాల ప్రభుత్వాలు 350 కోట్ల డాలర్ల అదనపు సహకారం అందించాల్సి వుంటుంది'' అని చెబుతున్నారు. అలాగే యుఎన్‌డిపి (ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం) 2014 నివే దిక ఇప్పటికీ 130 కోట్ల మంది ప్రజలు 1.25 డాలర్ల కన్నా తక్కువ సంపాదిస్తున్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి సంవత్సరం 60 లక్షల మంది పోషకాహారం లేక చని పోతున్నారని చెబుతున్నది. మన దేశంలో సాంఘిక, ఆర్థిక కుల గణన 2011 ప్రకారం ''గతంలో ఊహించిన దానికంటే మనదేశంలో పేదరికం మరింత భయానకంగా తయా రయ్యింది.'' పట్టణాల్లో రోజుకు రూ.33.40, గ్రామాల్లో రూ.27.20 కన్నా ఎక్కువ సంపాదించే వారు దారిద్య్రరేఖకు ఎగువనున్నట్టుగా లెక్కించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇంత హీనమైన ప్రాతిపదిక పెట్టినా పేదల సంఖ్య మనదేశంలో క్రమంగా పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. ఇలా అధికార, అనధికార లెక్కలను బట్టి చూస్తే పేదరికం ఎక్కడా తగ్గలేదని, కొన్ని దేశాలలో వేగంగా పెరుగుతున్నదని తెలుస్తున్నది. 
ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్త సమీర్‌ అమీన్‌ ''ఆర్థిక అభివృద్ధికి ఉదారవాద ఆర్థిక విధానాలను అమలు చేయించి ఇప్పుడు పేదరికం పెరిగిందని గొడవచేసి సహస్రాబ్ది లక్ష్యాలను ముందుకు తెచ్చారు'' అని పెట్టుబడిదారీ ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. లక్ష్యాలను రూపొందించే సమయంలో తమ జాతీయాదాయాల్లో 0.7 శాతం ఇస్తా మన్న జి-7 దేశాలు ప్రచారార్భాటం తప్ప ఆచరణలో అందులో సగం కూడా చివరికంటా ఇవ్వలేదు. అత్యంత పేద రికం, ఆకలితో అల్లాడుతున్న ఆఫ్రికాకు వీరి సహకారం 2010 నాటికే 5.6 శాతం తగ్గిపోయిందని నిపుణులు చెబు తున్నారు. ఈ విధంగా అబద్ధాలు, అసాధ్యాలతో ముగిసిన ఎండిజి సమీక్ష ఇప్పుడు మరిన్ని అబద్ధాలు, అసాధ్యాలకు తెరలేపుతూ ఎస్‌డిజిలను రూపొందించింది. సహస్రాబ్ది లక్ష్యాలే నెరవేరని నేపథ్యంలో నిలకడ అభివృద్ధి ఎలా సాధ్యం? పైగా ఈ నిలకడ అభివృద్ధి లక్ష్యాలు చూస్తే ఇవన్నీ సోషలిజం లో తప్ప సాధ్యం కానివని ఎవరికైనా అర్థం అవుతుంది. దేశాల మధ్య అంతరాలు, దేశాలలో ఆర్థిక అంతరాలను సృష్టించేది పెట్టుబడిదారీ వ్యవస్థ. మరి వాటిని తానే ఎలా అంతం చేస్తుంది? పేదరికం పెరిగినప్పుడూ, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నప్పుడూ సోషలిస్టు ఎజెండాలోని అంశాలను తానే నెరవేరుస్తున్నట్టు నమ్మబలకడం పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యూహంలో భాగం.
పెట్టుబడి, పేదరికం విడదీయరానివి
పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టిన నాటి నుంచి పేదరికం ఉంటున్నది. అపారమైన సంపదతోపాటు అపారమైన పేదరికాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ కలగలిపి సృష్టిస్తున్నది. ఇది ఆ వ్యవస్థ స్వభావం. పెట్టుబడిదారీ ఉత్పత్తి క్రమంలోనే నయవంచన ఇమిడి ఉంటుంది. దీనికి తోడు అసాధా రణమైన ప్రచారం. సోషలిస్టు శక్తులు బలహీన పడ్డ తరుణం లో దీనికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రపంచ బ్యాంకు 2010లో ఇచ్చిన ఈ వివరాలు చూడండి. పేద దేశా లకు సహాయం అందిస్తామని జి-7 దేశాలు వాగ్దానాలు చేసిన ఈ సందర్భంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలు అప్పులపై వడ్డీల క్రింద 18,400 కోట్ల డాలర్లు చెల్లించాయి. అంటే అవి ఎమ్‌డిజిలకిస్తామన్న సహకారానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 1985-2010 మధ్య పెద్ద దేశాలు పేద దేశాలకిచ్చిన దానికి, గుంజుకున్న దానికి మధ్య అంతరం 53,000 కోట్ల డాలర్లు. ఇన్ని చేసినా పెట్టుబడిదారీ ప్రపంచం 2008లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పేదరికం, ఆకలి, నిరుద్యోగం వంటివి అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండు వంటి దేశాలనే చుట్టుముట్టాయి. ఇక మనలాంటి దేశాల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు. గరీబీ హాఠావో, దేశం వెలిగిపోతోంది. జిడిపి (స్థూల జాతీయోత్పత్తి) 15 శాతా నికి పెంచుతాం, వంటి ఆర్భాటాలు గత 60 సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. పేదరికం మాత్రం పెరుగుతూనే ఉంది. అందువల్ల పేదరిక నిర్మూలన కన్నా పేదరికానికి కారణాలపై ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలి. సోషలిస్టు దేశాలలో పేదరికం నిర్మూలించడానికి జరిగే కృషిపై చర్చ జరగాలి. సోషలిజంలో మాత్రమే పేదరికం శాశ్వతంగా నిర్మూలించబ డుతుందన్న విషయాన్ని, ఆ చరిత్రను ప్రజల కందించాల్సిన తరుణం ఇది.
- ఆర్‌ రఘు