200 కుటుంబాలకు 40 ఏళ్లుగా స్థలాల్లేవు

రేపల్లె డివిజన్‌లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రలు రేపల్లెలో సోమవారం ప్రారంభమయ్యాయి. యాత్రను ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బిఎల్‌కె.ప్రసాదు ప్రారంభించగా జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్‌ మాట్లాడారు. పట్టణంలో అనేక సమస్యలున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, ఒకటో వార్డు రెండో వార్డు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఇళ్లస్థలాలు, రేషన్‌ కార్డుల సమస్య అధికంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం 14 ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం కేటాయించినా నేటికీ పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. సిసి రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఒక్క ప్రభుత్వ కుళాయి కూడా లేదని అన్నారు. అర్హతున్నా పింఛన్లు రానివారు ప్రతివార్డులోనూ ఉన్నారని, రెండేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బృందానికి వివరించారు. 40 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న 200 కుటుంబాలకు నివాస స్థలాలు లేవని, ఒక్కో ఇంట్లో రెండు మూడు కుటుంబాలు జీవించాల్సి వస్తోందని, అధికారులూ పట్టించుకోవడం లేదని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు బృందానికి మొరపెట్టుకున్నారు.