హుదూద్‌ వంచన..

 ఉత్తరాంధ్ర, ప్రధానంగా విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన హుదూద్‌ విలయం సంభవించి సరిగ్గా ఏడాది. ఆ ప్రచండ తుపాను ప్రాంతాల పునర్నిర్మాణం, బాధితుల సహాయ, పునరావాసాలపై నాడు ప్రభుత్వం గుప్పించిన హామీలపై వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. కంటి తుడుపు చర్యలు, ప్రచార్భాటం తప్ప ఒక్క పటిష్ట, శాశ్వత చర్య లేదుగాక లేదు. వినాశనం నుంచి ప్రజలు స్వంతంగా శక్తినంతా కూడదీసుకొని కుదుట పడ్డారు మినహా ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనా దక్షత, కొండంత మనసు వలన హుదూద్‌ బాధితుల జీవితాల్లో కాంతులు విరజిమ్మాయంటున్న అనుకూల మీడియా కథనాలు వంచనా శిల్పాలు. తుపానుతో ఛిద్రమైన విశాఖ మురికివాడలను, మత్స్యకార ప్రాంతాలను పరికిస్తే సర్కారు ప్రచార పటాటోపంలోని డొల్లతనం సాక్షాత్కరిస్తుంది. సర్వం కోల్పోయి గుడారాల్లో బతుకీడుస్తున్న అభాగ్యుల వాస్తవ చిత్రం కనబడుతుంది. దాదాపు రూ.22 వేల కోట్ల నష్టాలు మిగిల్చిన పెను విషాదంలో కూడా ప్రచార కోణం వెతుక్కొని హామీలన్నింటినీ నెరవేర్చామని సర్కారు వార్షిక సంబరాలు చేసుకోవడం దుర్మార్గం. తపానొస్తే అధికారులకు పండగ అనే నానుడి ఎప్పుడు పుట్టిందో తెలీదుకానీ ఎంత పెద్ద విపత్తు వస్తే అంత ప్రచారం వస్తుందనే ఆధునిక తెలుగు జాతీయాన్ని చంద్రబాబు ప్రవేశ పెట్టారు. గత తన జమానాలో ఒరిస్సాలో తుపాను వస్తే తానే ఆదుకున్నానని తరచు చెబుతూ ఉంటారు బాబు. హుదూద్‌ తుపాను విశాఖ వద్ద తీరం దాటుతుందని రెండు మూడు రోజుల ముందే వాతావరణ కేంద్రం హెచ్చరించినా స్పందించలేదనే విమర్శలకు రాష్ట్ర సిఇఒగా పిలిపించుకునే బాబు ఏం సమాధానం చెబుతారు? హుదూద్‌ 61 మందిని కబళించిందంటే సర్కారు సకాలంలో స్పందించలేదనేగా అర్థం. తుపానొచ్చి వెలిశాక సిఎం విశాఖలో తిష్టవేసి తెగ హడావుడి చేసి యంత్రాంగాన్ని సహాయ పనులు చేయనీకుండా తన ప్రొటోకాల్‌కు సమయం వెచ్చించే పరిస్థితులను కల్పించడమే పాలనా దక్షతా?
మహా నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది మొసలి కన్నీరే. ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్‌ సర్వే చేసి రూ.వెయ్యి కోట్ల అత్యవసర సాయం ప్రకటించగా అందింది రూ.750 కోట్లలోపు మాత్రమే. ఆ ఏడాదికి సాధారణంగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే విపత్తు స్పందన నిధి కలిసే ఉంది. ప్రత్యేకంగా హుదూద్‌కు ఇచ్చింది మహా అయితే రూ.500 కోట్లు. నివేదికలు పంపితే చేతికి ఎముక లేకుండా నిధులు పారిస్తామన్న ప్రధాని తాను ప్రకటించిన సాయానికే కోత పెట్టి కఠినం దాల్చారు. తమ చెప్పు చేతల్లో మోడీ పని చేస్తున్నారని, తాను ఎంత చెబితే కేంద్రం అంత అని వల్లించే బాబు హుదూద్‌ సాయం సాధించడంలోనూ మెతక వైఖరి అవలంబించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకున్న బిజెపి, టిడిపిలు విభజన హామీలకు మాదిరిగానే హుదూద్‌ వాగ్దానాలనూ తుంగలో తొక్కాయి. ఆ రెండు పార్టీల బంధం రాజకీయలబ్ధికి, నాయకుల స్వప్రయోజనాలకు మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదని 'హుదూద్‌' తేల్చేసింది. తుపానుపై పౌర సమాజం స్పందించిన స్థాయిలో కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణం. చిన్న పిల్లలు సైతం విరాళాలు సేకరించి అందజేయగా, దాతల నుంచి సమకూరిన రూ.260 కోట్లను కూడా ఆపన్నులకు ఖర్చు చేయని పాషాణ హృదయం చంద్రబాబు సర్కారు స్వంతం. 
నాలుగు జిల్లాలు, 138 మండలాలు, కోటి మందిపై హుదూద్‌ విరుచుకు పడగా సహాయ చర్యల నిమిత్తం రూ.1,800 కోట్లు ఖర్చు చేశామని బాబు సర్కారు గొప్పగా చెప్పడం విడ్డూరం. జరిగిన నష్టంతో పోల్చితే సర్కారు విదిల్చింది పిసరంత. అందులోనూ అవినీతి పాలు అధికం. ఏడాదైనా బాధితులకు తక్షణ సాయం అందలేదంటే ప్రభుత్వ క్రూరత్వం తెలుస్తుంది. నాలుగున్నర లక్షల గృహాలు ధ్వంసం కాగా ఒక్క పక్కా ఇల్లు నిర్మించలేదు. మోడల్‌ కాలనీలని ఊదరగొట్టిన ఏలికలే దీనిపై జవాబు చెప్పాలి. తుపాను సాయానికి ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయడం సర్కారీ ఘాతుకానికి పరాకాష్ట. పడవలు, తెప్పలు కోల్పోయిన మత్స్యకారులకు పైసా ఇవ్వలేదు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించిన రైతులకు, గిరిజనులకు పూర్తి స్థాయిలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందలేదు. రుణ మాఫీ వంకతో బ్యాంకులు రైతుల అప్పులను రీషెడ్యూల్‌ చేయలేదు. వృత్తిదారుకు, ఆటో, రిక్షా, తోపుడు బండ్ల వాళ్లకూ సాయం చేయలేదు. పరిశ్రమలకు బీమా కంపెనీల నుంచి అరకొర సాయం తప్ప సర్కారు ఇచ్చిందేమీ లేదు. బ్యాంకులు సైతం ఆదుకోలేదు. భారీ ప్రభుత్వరంగ పరిశ్రమలు తుపానుకు భారీగా నష్టపోయాయి. కోలుకోవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం ఎంతైనా అవసరం. విశాఖ నగరంలో ప్రధాన కూడళ్లల్లోని ఒకటి రెండు పర్యాటక ప్రదేశాలను పునరుద్ధరించి ఇదే పునరావాసం అని సర్కారు వేడుకలు చేసుకోవడం వంచనే. ఇప్పటికైనా హుదూద్‌ ప్రాంత పునరావాస, పునర్నిర్మాణంపై సర్కారు చిత్తశుద్ధితో పని చేయాలి. హామీలు నెరవెర్చాలి. తమకు సహాయం అందలేదని ప్రజలు రోధిస్తుండగా ప్రభుత్వం వేడుకలు చేసుకుంటే జనం ఛీకొడతారు.