స్మార్ట్‌ సిటీ ఫీజు - పిపిపి పేర ప్రాజెక్టులు ప్రైవేటీకరణ నిధులన్నీ స్మార్ట్‌ ఏరియాకి తరలింపు

స్మార్ట్‌సిటీ వలన కలిగే ప్రయోజనాలకు ప్రతి ఫలంగా జివిఎంసి ఆస్ధిపన్నుపై 10 శాతం అదనంగా స్మార్ట్‌సిటీ ఫీజు వసూలు  చేయాలని నిర్ణయించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ప్రతిపాదను నగర టాక్స్‌ పేయర్స్‌కు తీవ్ర హాని చేస్తుందని సిపిఐ(ఎం) అభిప్రాయపడుతున్నది. స్మార్ట్‌సిటీలో అనేక ప్రాజెక్టులను పిపిపి పేర అధికార పార్టీ నాయకులు బినామీ సంస్థలకు ధారాదత్తం చేయుటకు పలు  ప్రతిపాదనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ స్కీము క్రింద మంజూరయ్యే నిధులన్నీంటిని స్మార్ట్‌ ఏరియా ప్రాంతమైన ఆర్‌.కె బీచ్‌ ఏరియాకి మల్లించే ప్రతిపాదను చేశారు. ఈ నిర్ణయాలు అత్యంత వివక్షతతోను, బాధ్యతా రహితంగా ఉన్నాయి. స్మార్ట్‌సిటి నిర్ణయాలు, ప్రతిపాదలను 20 లక్షలు  ప్రజలు  నివాస ప్రాంతాల అభివృద్ధిపై  ప్రతికూల ప్రభావం చూపుతాయి.
    జివిఎంసి మొత్తం విస్తీర్ణం 681 చ॥కి॥మీ (1,68,031 ఎకరాలు). ఇందులో 6.88చ॥కి॥మీ (1700 ఎకరాలు ) విస్తీర్ణం గల ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధికి నిర్ణయించారు. ఆర్‌.కె బీచ్‌, వాల్తేరురోడ్‌, ఈస్ట్‌పాయింట్‌ కాలనీ, కిర్లంపూడి లేఅవుట్‌, పాండురంగాపురం, దసపల్లా లేఅవుట్‌ ప్రాంతాలు స్మార్ట్‌సిటీ ఏరియా పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని 1602 కోట్లతో 5 ఏళ్ళ కాలంలో (2016 - 21) స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జివిఎంసి మొత్తం జనాభా 20.91 లక్షలు. స్మార్ట్‌సిటీ  ప్రాంతంలో సుమారు 70 వేల మంది నివశిస్తున్నారు. మిగిలిన నగరంతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు  మెరుగ్గా ఉన్న ప్రాంతం. 20 లక్షల  ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఇప్పటికే అభివృద్ధి అయిన ప్రాంతంలో 1600 కోట్లు ఖర్చు చేయటం దుర్మార్గం.