సెప్టెంబర్‌ 10, 11న జిల్లాకు సమగ్రాభివృద్ధి జాతా

రాష్ట్ర సమాగ్రాభివృద్ధి కోసం సిపిఎం, సిపిఐ చేపట్టిన జాతా సెప్టెంబర్‌ 10, 11న గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుందని, జాతాను విజయవంతం చేయాలని సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం స్థానిక బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జాతా వివరాలు వెల్లడించారు. రాష్ట్ర సమాగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను ప్రచారం చేస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 15న విజయవాడలో మహాగర్జన సభ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో వివిధ రంగాలపై సదస్సులు పూర్తి చేశామన్నారు. ఇప్పుడు విశాఖపట్టణం, అనంతపురం నుండి రెండు బస్సు యాత్రలు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. రాయలసీమ నుండి బయలు దేరే యాత్ర 10వ తేదీన వినుకొండలో ప్రవేశించి అక్కడి నుండి నర్సరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి పట్టణాల్లో పర్యటిస్తుందన్నారు. 11వ తేదీన గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలలో పర్యటించి సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో సభలను జయప్రదం చేయాలని కోరారు. ఎన్నికలకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చాయని, ఎన్నికల అనంతరం ప్రజలకిచ్చిన వాగ్దానాలు విస్మరించి, పెద్దనోట్లు రద్దు, జిఎస్‌టి తదితర ప్రజావ్యతిరేక విధానాలను అమలుతో ప్రజలపై మోయలేని భారాలు మోపారని విమర్శించారు. రైతుల సమస్యలు ఈ కాలంలో జఠిలమయ్యాయని, దేశ వ్యాప్తంగా రెండు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా, రాష్ట్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను వంచించిందని, సిఎం చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో 50 వేల ఎకరాలను సమీకరించి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో అమరావతి చుట్టూ అభివృద్ధిని కేంద్రీకరిచే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని కోరారు.