'సివి సమగ్ర రచనలు - సమాలోచన'

కుల వ్యవస్థపై పోరాటానికి సివి రచనలు ఆయుధంగా ఉపయోపడతాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. విజయవాడలోని వేదిక కళ్యాణ మంటపంలో ఆదివారం సాహితీ, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యాన 'సివి సమగ్ర రచనలు - సమాలోచన' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి అధ్యక్షులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అధ్యక్షత వహించారు. సమాలోచనలో భాగంగా 'కులం-వర్గం - సివి విశ్లేషణ' అంశంపై జరిగిన సమావేశంలో రాఘవులు మాట్లాడారు. సాంస్కృతిక విప్లవం అవసరమని సివి రచనలు మనకు చెబుతున్నాయన్నారు. సాంస్కృతిక ప్రతీఘాత విప్లవం సృష్టించడానికి బిజెపి, సంఫ్‌ు పరివార్‌లు ప్రయత్నిస్తున్నాయన్నారు. సృజనాత్మక స్వేచ్ఛను హరిస్తున్నాయని పేర్కొన్నారు. రచయితల కాలాలను శాసించే, విమర్శకుల నోళ్లు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కళాకారుల స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ప్రమాదకర ప్రయత్నాలను అడ్డుకుంటేనే సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లగలమన్నారు. దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు మాట్లాడుతూ కులం, సామాజ్య్రవాదానికి వ్యతిరేకంగా పోరాడదామన్నారు. కులం అసృశ్యత అడ్డుగోడలను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్స్‌, అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే, పెరియార్‌ రచనలు చదవాల్సి ఉందన్నారు.
ఆర్థిక పోరాటం కంటే సాంస్కృతి పోరాటం కీలకం
ఆర్థిక పోరాటం కంటే సాంస్కృతిక పోరాటం సమాజ మార్పులో కీలక భూమిక పోషిస్తుందని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. 'సాంస్కృతిక ఉద్యమం - సివి రచనలు' అనే అంశంపై జరిగిన సమావేశంలో ఐలయ్య మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తులు ఎక్కువ కాలం ఉండవనే ఆశ ఆయన రచనల్లో దాగి ఉందన్నారు. సాహితీ విమర్శకులు కడియాల రామమోహనరావు మాట్లాడుతూ శ్రామిక, ఉత్పత్తి రంగాలకు చెందిన వారిని అణిచివేయటానికి మనుధర్మశాస్త్రం దోహదపడిందన్నారు. మనిషిని మనిషే వేరు చేసే పరిస్థితులు దేశంలో ఉన్నాయన్నారు. జనసాహితి సంపాదకులు దివికుమార్‌ మాట్లాడుతూ సాంస్కృతిక ఉద్యమాలకు సాహిత్య ముద్ర వేసిన వ్యక్తి సివి అన్నారు. దేశంలో ఎన్నికల వ్యవస్థను విశ్లేషించారని చెప్పారు. మోతుకూరి నరహరి మాట్లాడుతూ మన కవివి మనం బతికించుకోవాలని, దాని కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వై.సిద్ధయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమాలు తెలుగు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాయన్నారు.
రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తున్న ఆర్థిక వ్యవస్థ
మానవజాతి పురోగతి సోవియట్‌ పతనంతో ఆగిపోయిందని నాస్తిక కేంద్రం సభ్యులు లవణం అన్నారు. 'నాస్తికత్వం, హేతువాద దృక్పతాల ఆవశ్యకత' అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాంఘిక, ఆర్థిక రంగాలు మాత్రమే తిరోగమించడాన్ని చూస్తున్నారని, మనిషి మెదడు యాంత్రీకరణకు కేంద్రంగా మారడాన్ని గుర్తించాలన్నారు. గతంలో ఆర్థిక వ్యవస్థను రాజకీయ వ్యవస్థ నియంత్రించేదని, ఇప్పుడు రాజకీయ వ్యవస్థను ఆర్థిక వ్యవస్థ నియంత్రిస్తోందన్నారు. హేతువాది సిహెచ్‌ శివారెడ్డి మాట్లాడుతూ హేతువాద, నాస్తిక, చార్వాక దృక్పథంతో సివి రచనలు చేశారన్నారు. భౌతికవాదం దృక్పథంతో ఎక్కడా రాజీపడలేదన్నారు.
సివి రచనల ఆవశ్యకత మరింత పెరిగింది
సివి రచనల అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉందని అభ్యుదయ రచయిత సంఘం నాయకులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. 'మార్స్కిస్టు దృక్పథం - సివి రచనలు' అన్న అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్స్కిజాన్ని భారతదేశ సామాజిక పరిస్థితులకు అన్వయించి రచనలు చేసిన వ్యక్తి సివి అని కొనియాడారు. సివి పుస్తకాలను ఆంగ్ల అనువాదం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సివి దేశీయ మార్క్సిస్టు రచయిత అన్నారు. భారత జాతి పునరుజ్జీవానికి కులం ఒక సమస్యగా మారుతుందని ఆయన ముందుగానే గుర్తించారన్నారు. సివి రచనల్లో సమ సమాజ కాంక్ష, శ్రామికపక్ష పాతం ఉందన్నారు. డబ్బు ప్రభావం పోయి ప్రజాస్వామ్యం మనగలగాలంటే ప్రజా ఉద్యమాలొక్కటే పరిష్కారంగా ఆయన రచనలు సూచిస్తాయన్నారు. ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ కులాంతర వివాహాల గురించి ముందు చూపుతో ఆయన రచనలు ఉన్నాయన్నారు. సాహితీవేత్త ఖాదర్‌ మొహిద్దీన్‌ మాట్లాడుతూ కులంపై అవగాహన, భాషకు సంబంధించిన కృషి, మార్క్సిస్టు దృక్పథం సివి రచనల్లో కనిపిస్తాయన్నారు. గతితార్కిక భౌతికవాదం కొలమానంగా రచనలన్నీ కొనసాగాయన్నారు. ప్రజాశక్తి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఎస్‌ వెంకట్రావు మాట్లాడుతూ డార్విన్‌ పరిణామ క్రమం శాస్త్రీయ విషయాలను ముందుకు తీసుకు వెళ్ళేందుకు సివి రచనలు దోహదం చేస్తాయన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ పుణ్యవతి మాట్లాడుతూ భావ విప్లవానికి ప్రతీక సివి రచనలన్నారు. సివి రచనలు ఎన్నో మెదళ్లను విస్పోటనానికి గురిచేశాయన్నారు. వర్ణాశ్రమ ధర్మాల ముసుగులో మహిళలపై సాగుతున్న సామాజిక కుట్టుబాట్లు, మత సాంప్రదాయాలను అడ్డుకునేందుకు తిరిగి రచనలు సాగించాలన్నారు. కార్మికలోకం సంపాదకులు కె శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడారు.