సిపిఎం పాదయాత్రలో సమస్యల వెల్లువ

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, మురుగు కాల్వలు, గృహ నిర్మాణాలను ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మాణం చేపట్టి పూర్తిచేయాలని జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు కాకుమాను నాగేశ్వరరావు, యన్‌.కాళిదాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్ర మంగళవారం పెదనందిపాడు చేరింది. పాదయాత్రలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజలు సాగునీరు, తాగునీరు లేక దశాబ్దాలుగా అల్లాడుతుంటే అధికారం సాధించిన ఆయా పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలతో కాలం గడవటమే గాని, సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వాలే లేవన్నారు. గుంటూరు ఛానల్‌ను గతంలో మాదిరిగానే దగ్గుబాడు హై లెవల్‌ ఛానల్‌గా గుర్తించి పొడిగిస్తేనే తప్ప ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, ప్రకాశం జిల్లాలోని పర్చూరు, ఇంకళ్ళు ఆయా ప్రాంత ప్రజలకు సాగు, తాగు నీరు కొరత తీరుతుందన్నారు. 70శాతం ఉన్న కౌలు రైతుల చట్టాన్ని ప్రతిష్టవంతంగా అమలు పర్చాలన్నారు. ఓగేరు, నల్లమడ వాగుల మలుపులు తొలగించి స్ట్రైట్‌ కట్‌ చేయాలని, కోటప్పకొండ వద్ద 500 ఎకరాలలో రిజర్వాయరు నిర్మించి సాగర్‌ కాల్వకు అనుసంధానం డిమాండ్‌ చేశారు. ఎన్నో పోరాటాలు, ప్రాణా త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు ప్రజలు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఎన్‌టిఆర్‌ కాలనీ, పాత బస్టాండ్‌ సెంటర్‌, గాంధీ బొమ్మ సెంటర్‌, హరిజన కాలనీ, చెంచుల కాలనీలోని ప్రజలు తమ ఇక్కట్లను పాదయాత్రలోని నాయకులకు వివరించారు.