సిపిఎం నాయకునిపై హత్యాయత్నానికి నిరసనగా మిన్నంటిన నిరసనలు

గుంటూరులో సిపిఎం నాయకులపై టిడిపి గూండాలు హత్యాయత్నాన్ని నిరసనగా మంగళగిరి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అంబేద్కర్‌ సెంటర్లో టిడిపి గూండా గడ్డిబొమ్మను దహనం చేశారు. తొలుత సిపిఎం కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. టిడిపి గూండా గడ్డిబొమ్మను దహనం చేస్తున్న సమయంలో పట్టణ ఎస్‌ఐ షేక్‌ జిలాని పోలీసులతో వచ్చి గడ్డిబొమ్మ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, సిపిఎం నాయకులకు వాగ్వివాదం జరిగింది. రౌడీషీట్‌ గడ్డిబొమ్మను దహనం చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడానికి సిపిఎం నాయకులు విమర్శించారు. రౌడీషీటర్లకు పోలీసులు అండగా ఉంటారా అని ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వివాదం అనంతరం సిఐ బి.బ్రహ్మయ్య సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సిఐకు సిపిఎం నాయకులు రౌడీషీటర్‌ గడ్డిబొమ్మను దహనం చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని వివరించారు. అనంతరం గడ్డిబొమ్మను దహనం చేశారు. సిపిఎం డివిజన్‌ కార్యదర్శి జెవి.రాఘవులు మాట్లాడుతూ ఆంజనేయులు, సతీష్‌లపై దాడిచేసిన టిడిపి గూండాలను వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్‌చేశారు. భూ కబ్జాదారులకు టిడిపి అండగా నిలుస్తుందని అన్నారు. సిపిఎం నాయకులపై దాడులుచేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని అన్నారు. గూండాలకు అండగా ఉంటున్న సిఐని సస్పెండ్‌ చేయాలని కోరారు.