సిపిఎం ఆధ్వర్యాన గిరిజనుల భూపోరాటం..

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో గిరిజనులు మంగళవారం భూ పోరాటం చేశారు. సిపిఎం ఆధ్వర్యాన 60 ఎకరాల సీలింగ్‌ భూముల్లో జెండాలు పాతారు. ఆ భూమిలోని తుప్పలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. 
మండలంలోని చింతలపూడి పంచాయతీ పరిధిలోని 23, 32, 37 సర్వే నెంబర్లలో 60 ఎకరాల సీలింగ్‌ భూములను గతంలో కొంత మంది స్థానిక గిరిజనులకు ప్రభుత్వం పట్టాలిచ్చారు. పట్టణ ప్రాంతానికి చెందిన బడాబాబులు గిరిజనులను, పేదలను ప్రలోభాలకు గురిచేసి, డబ్బు ఆశజూపి ఆ భూములను లాక్కొని సొంతం చేసుకున్నారు. దీనిపై 2007లో కలెక్టర్‌కు సిపిఎం ఫిర్యాదు చేయగా, స్పందించిన ఆయన గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగించాలని తహసీల్దారును ఆదేశించారు. ఆ మేరకు భూములను గిరిజనులకు అప్పగించినప్పటికీ అందులోకి గిరుజనులను రానివ్వకుండా బడాబాబులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు జెండాలు పాతి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, మండల కార్యదర్శి సిహెచ్‌.రాజు మాట్లాడుతూ మళ్లీ గిరిజనుల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా, బెదిరింపులకు పాల్పడినా తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. గతంలో పేదలుకు భూములు ఇవ్వగా, ఇప్పుడు ఆ భూములను లాక్కునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆటలను సాగన్విబోనిమని, మరిన్ని భూ పోరాటాలు చేస్తామని వెంకన్న స్పష్టం చేశారు.