సింగపూర్‌ చంద్రబంధంలో అమరావతి

 ఆలూలేదు, చూలూ లేదు అమరావతి అంతర్జాతీయ నగరం అని ఆర్భాటం చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం-ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కల్పించిన భ్రమలూ, చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 'సింగపూర్‌ కంపెనీల గొంతెమ్మ కోర్కెలు' శీర్షికతో ఈనాడు పత్రిక డిసె ంబర్‌ 11న ఇచ్చిన వార్త దీనికొనసాగింపే. ఆ వెంటనే సదరు వార్తను సమతుల్యం చేసేందుకన్నట్టు ఆంధ్రజ్యోతి మరో వార్తా కథనం ప్రచురించింది. వాస్తవంగా అమరావతి నిర్మా ణ ప్రణాళిక ఖరారు దగ్గరకు వచ్చేసరికి సింగపూర్‌ కంపెనీల ప్రవర్తన ఎలా ఉన్నదో మొదటి కథనం వివరిస్తే- అలాటి మార్పులేమీ లేనట్టు, అంతా సుభిక్షంగా జరిగిపో తున్నట్టు చిత్రించేందుకు రెండవ కథనం ప్రయత్నించింది. మరేదైనా పత్రికలో వచ్చి ఉంటే ఈ కథనాలకు ఉద్దేశాలు ఆపాదించి విరుచుకుపడేవారేమో. కానీ ఇప్పుడా అవకాశం లేదు.
సింగపూర్‌ కంపెనీలు రాజధాని నిర్మాణం చేపట్టడానికి హిరణ్యాక్ష వరాలు కోరుతూ విషమ షరతులు పెడుతున్నాయనేది ఈ కథనాల సారాంశం. అస్సెండాస్‌, సిన్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ అనే మూడు కంపెనీలను ఒక కన్సార్టియం(కూటమి)గా ఏర్పాటు కావాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వమే. అందుకు సింగపూర్‌ సర్కారు వత్తాసు లభించింది. నిజానికి రాజధాని అన్న పదం మొదలైనప్పటి నుంచి సింగపూర్‌ చుట్టూ లెక్కలేనన్ని ప్రదక్షిణలు కొట్టింది ముఖ్యమంత్రి బృందమే. ఏ ప్రాతిపదికన ఈ పర్యటనలు ఇంత ప్రాధాన్యతనిచ్చి చేస్తున్నారనే దానికి సమాధానమే లేకపోయింది. సింగపూర్‌ ప్రభుత్వం లాభాపేక్ష రహితంగా రాజధాని నిర్మాణానికి సహకరిస్తుందని అప్పట్లో చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటించారు. అలా చేయడం ఈ పోటీ ప్రపంచంలో ఎలా సాధ్యం, ఎందుకు చేస్తారు అని అడిగినవారిపై ఆగ్రహోదగ్రులైనారు. తీరా చూస్తే వారు గీసిచ్చిన మ్యాప్‌లో సవరణలు కోరేందుకు తనే వెళ్లవలసి వచ్చింది. ఇప్పటికైనా అది తుది రూపం తీసుకుందో, లేదో తెలియదు. ఆ మ్యాప్‌ ఇచ్చినందుకు కూడా ప్రతిఫలం చెల్లించినట్టు తర్వాత వెల్లడైంది. మ్యాప్‌తో పాటే నిర్మాణంలోనూ భాగం పంచుకోవలసిందిగా తను చేసిన విజ్ఞప్తిని సింగపూర్‌ మన్నించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వమా, ప్రయివేటు కంపెనీలా అన్న మాటకు సమాధానం రాలేదు. తర్వాత అచ్చంగా ప్రయివేటు కంపెనీలే ఈ పనిచేస్తాయని తేలిపోయింది. వేల ఎకరాల భూమి మనం ఇస్తూ, వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగిస్తూ ఆ దేశం చుట్టూ మనమెందుకు తిరగాలన్న ప్రశ్న కూడా అప్పుడే ముందుకొచ్చింది. రెండు దేశాలలోని ప్రభుత్వాలకూ ఏ బాధ్యతా లేని ప్రయివేటు కంపెనీలకు ఇంత కీలకమైన రాజధాని నిర్మాణ బాధ్యతను పిపిపి నమూనాలో కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు హడావుడి పడినట్టు?
శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులను, కేంద్రం ఇచ్చిన సూచనలను కూడా పెడచెవిని పెట్టి అవాస్తవికమైన అతి భారీ అంచనాలతో వేలకు వేల ఎకరాలు సమీకరణ పేరిట సేకరించింది ప్రభుత్వం. ఈ విధంగా వచ్చిన 36 వేల ఎకరాలు చాలనట్టు తన దగ్గరున్న బంజరు, పోరంబోకు భూములను మరో 12 వేల ఎకరాలు కట్టబెట్టింది. ఇదంతా క్రిడాకు బదలాయించినట్టు కనిపించినా ఆచరణలో పెత్తనం చెలాయించేది, వ్యాపార లావాదేవీలు జరిపేది మాత్రం ఏలినవారి ప్రాపకం పొందిన విదేశీ కంపెనీలే. అమరావతి నగర అయోమయావస్థ అన్న వ్యాసం(2015 నవంబరు 29)లో పేర్కొన్నట్టు ఈ విషయమై రైతులకు ఎలాటి లిఖిత పూర్వక హామీ ఇచ్చింది లేదు. ముఖ్యమంత్రి మాటపై నమ్మకం తప్ప! వారికి రేపు ఎక్కడ, ఎలాటి ప్లాట్లు, ఏ రేటులో ఇస్తారన్నది ఇప్పటికీ చిక్కుముడిగానే ఉంది. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా రైతులు భూమిని ఇచ్చారన్న పాలకులు ఇవ్వని రైతు అరటితోటను ముందుగా ధ్వంసం చేయడం తక్కినవారినీ ఒత్తిడికి గురి చేసే ప్రయత్నమే. రైతులకు ఏటా ఇస్తామన్న పాతిక వేల రూపాయల పరిహారం, యువతకు ఉపాధి కల్పన వంటివన్నీ అక్కరకు రాని హామీలే అవుతున్నాయి. కానీ మరోవైపున సింగపూర్‌ కంపెనీలు మాత్రం ఇష్టానుసారం షరతులు పెట్టి ప్రజల ఆస్తులకూ, ప్రభుత్వ వనరులకూ ఎసరు పెట్టేందుకు సిద్ధమవుతున్నా యి. అవి గొంతెమ్మ కోర్కెలనేది కొత్తగా కనిపెట్టవలసిన విషయమేమీ కాదు. ప్రభుత్వ ప్రాయోజిత ప్రహసనం ప్రారంభం నుంచి అలాగే నడుస్తున్నది. ముఖ్యమంత్రి నోట రియల్‌ ఎస్టేట్‌ భాషలో 'వెంచర్‌' అన్న పదం ఎన్నిసార్లు వచ్చిందో చెప్పలేము. అయితే ఏ వెంచర్‌లోనైనా భూమి ఇచ్చిన వారికి సమభాగస్వామ్యం ఉంటుంది. కానీ ఇక్కడ భూమి ఇచ్చిన రైతులే గాక దాన్ని ప్రయివేటు కంపెనీల పరం చేసేందుకు మధ్యవర్తిగా వ్యవహరించే క్రిడా పాత్ర కూడా నామమాత్రమై పోవడం విపరీతం!
ప్రభుత్వం రూ.300 కోట్ల మూలధన పెట్టుబడి పెట్టి-రాజధాని కేంద్రకం(కోర్‌ కాపిటల్‌) కోసం నాలుగు వేల ఎకరాలపై జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇస్తే దాన్ని బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటామని సింగపూర్‌ కంపెనీలు పెట్టిన షరతు. ఇది కొత్తేమీ కాదు. ఇప్పుడు ఇన్‌ఫ్రా కంపెనీల పేరిట చక్రం తిప్పుతున్న వారంతా చేసేది అదే! ప్రజల భూమి, ప్రభుత్వ ఆర్థిక సంస్థల రుణాలు, తర్వాత ప్రజల నుంచి ఎంట్రీ ఫీజులు, టోలుగేట్ల వసూలుతో పాటు అప్పనంగా వ్యాపార స్థలం కేటాయింపు ఇదే పిపిపి రహస్యం! తెలుగుదేశం హేమాహేమీలే గాక కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సన్నిహితులకు చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు కూడా ఈ తరహాలోనే భారీ హైవేలు, తదితరాల నిర్మాణం సాగిస్తున్నాయి. ఇంతా చేస్తే రాజధాని ప్రాంతం అభివృద్ధికి మూడు దశాబ్దాలైనా పడుతుందని మరో చావు కబురు చల్లగా చెబుతున్నాయి. 17 కోట్ల చదరపు అడుగుల భవన నిర్మాణాలు యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలన్న ప్రభుత్వ కోర్కెకు సానుకూల స్పందన రాకపోగా ఎదురు రూ.300 కోట్లు అడగడం ఇప్పటి వరకూ చెప్పిన కబుర్లను కకావికలు చేసింది. ఈ పాటి భాగ్యానికి కేంద్ర ప్రాంతం నుంచి 25 కిలోమీటర్ల మేర మరే వ్యాపార సంస్థకూ అవకాశం ఉండరాదని కూడా సింగపూర్‌ కన్సార్టియం షరతుగా ఉంది. కోరి కొరివితో తలగోక్కోవడం అంటే ఇంతకన్నా ఏముంటుంది? ఇందుకు బదులుగా మొదట అనుకున్నట్టు 16.9 కిలోమీటర్ల పరిధికే తాను ఒప్పిస్తానన్నట్టు ప్రభుత్వం మాట్లాడుతున్నది.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ.27 వేల కోట్ల వ్యయం కావచ్చని అంచనా వేసినట్టు, ఆ మేరకు దశలవారీగా కేటాయింపులు చేసేందుకు సుముఖత తెల్పినట్టు కూడా సమాచారం. నిర్ణీత విస్తీర్ణంలో అవసరమైన పాలనా వ్యవహారాల కోసం భవన నిర్మాణం చేసే విధంగా ఆలోచించి ఉంటే ఇప్పటికే కొంత పని జరిగేది కూడా. అప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసిన బంజరు, పోరంబోకులు 12 వేల ఎకరాలు కూడా ఇంచుమించు సరిపోయేది. పాలనా సౌలభ్యం పెరుగుతున్న కొద్దీ విస్తరణకు అవకాశం అట్టిపెట్టుకుని ఉండొచ్చు. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైటెక్‌ సిటీ, ఎంఆర్‌ ఎంజిఎఫ్‌ వంటి ప్రయోగాలు చేసిన చంద్రబాబు దృష్టి అలా లేనేలేదు. రాజధానిని ఒక కమర్షియల్‌ వెంచర్‌గానే ఆయన చూస్తున్నారు. సింగపూర్‌ ద్వారానైనా సరే తెలుగుదేశం మోతుబరులకు వాణిజ్య ప్రయోజనాలు చేకూర్చాలన్నది ఒక అదృశ్య వ్యూహం. దానికి విస్తారమైన భూములు కావాలి. మళ్లీ మళ్లీ సేకరించడం కష్టం గనక ఒక్క దెబ్బతో వీలైనన్ని వేల ఎకరాలు రాబట్టుకోవాలి. భూ బ్యాంకు ఏర్పాటు చేసుకోవాలి. అందులోనూ సారవంతమైన డెల్టా భూములను రాబట్టుకోవడం సులభం కాదు గనక పంచరంగుల కలలు చూపించాలి. ఈ వ్యూహం బాగా తలకెక్కిన కొందరు కోట్లు దండుకుంటుంటే ఆయనే భరించలేక కృత్రిమంగా భూమి రేట్లు పెంచితే అభివృద్ధికి ఆటంకం అని సూక్తులు వినిపించారు. సింగపూర్‌ షరతులు సరిగా లేకపోతే తాను మార్పించినట్టు, అలాగే రేట్లు పెంచేవారిని అదుపు చేసినట్టు కనిపించే ప్రయత్నం తప్ప నిజంగా ఆ దిశలో చేసింది, చేస్తున్నది శూన్యం. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖుల నివాసాలు అన్నీ ప్రయివేటు భవనాలలోనే ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం రియల్లర్ట పంట పండించేందుకు సిద్ధమై పోతున్నది. మంత్రివర్గ సమావేశం దీనిపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రికి అధికారం ఇవ్వడంతో కథ సమాప్తమవుతుంది. తర్వాత జరిగేది ఎలానూ జరుగుతుంది. ఈ తరహా మంతనాలు, ప్రాయోజిత కథనాలు కట్టిపెట్టి పూర్తి వివరాలు శ్వేతపత్రం ద్వారా విడుదల చేయడం ప్రభుత్వ బాధ్యత.
కరువు తాండవిస్తున్నదని ఇక్కడ పర్యటించి వెళ్లిన కేంద్ర బృందాలు చెబుతున్నా కేంద్రం మాత్రం ప్రత్యేక హోదా సహాయం మినహాయింపులు రావంటున్నది. తాజా పార్లమెంటు సమావేశాలలో ఈ మేరకు స్పష్టంగానే తేల్చి చెప్పింది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఇరు రాష్ట్రాలూ చెరో కోణంలో చేసిన పునః పరిశీలన విజ్ఞప్తిని కూడా కేంద్రం తిరస్కరించింది. సుప్రీం కోర్టు కూడా ఇందుకు భిన్నంగా చెప్పకపోవచ్చు. ఇలా మౌలికాంశాలు అనేకం పరిష్కారం నోచకుండా ఉంటే-వీటికోసం కేంద్రం దగ్గర అఖిలపక్ష పోరాటం చేసేబదులు రైతుల భూములకు ఎసరు పెట్టాలని హడావుడి పడటం ప్రజల అసంతృప్తికే గాక ఆగ్రహానికీ దారి తీస్తుంది. అమరావతి వ్యవహారమే ఇంత అస్తవ్యస్తంగా ఉంటే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి సమీపంలో నరసరావుపేటను మరో మహా నగరంగా అభివృద్ధి చేస్తానని హామీనిస్తున్నారు. చరిత్రలో నగరాల పెరుగుదలకు వెనక ఉన్న గమన సూత్రాలను పట్టించుకోని ఈ తరహా ప్రచారార్భాటం ప్రభుత్వాలను పలచన చేయడానికే పనికి వస్తుంది తప్ప నమ్మే అమాయకులెవరూ ఉండరు. 
- తెలకపల్లి రవి