సామ్రాజ్యవాదపు వికృత శిశువు ఉగ్రవాదం..

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)..ఆ మధ్య జర్నలిస్టులకు నారింజ రంగు చొక్కాలు తొడిగి..ఏడారిలో కత్తులు ఝుళిపిస్తూ అతి క్రూరంగా గొంతుకలు తెగ్గోసి..ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో ఉంచి సంచలనం సృష్టించిన సాయుధ సంస్థ. 'మీ మిస్సైళ్లు మా మీద పడుతున్నంత కాలం..మా కత్తులు ఇలా గొంతులు కోస్తూనే ఉంటాయి' అని అమెరికా అధ్యక్షునికి హెచ్చరికలు పంపిన సంస్థ. ఇరాక్‌, సిరియాల తర్వాత జోర్డాన్‌, లెబనాన్‌లకు విస్తరించి, పాలస్థీనాను విముక్తం చేసి.. విస్త త ఖలీఫా రాజ్యం తెస్తామని, తర్వాత క్రమేపీ ప్రపంచమంతా ఖలీఫా రాజ్యం తేవాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించింది. అదే ఇప్పుడు పారిస్‌లో వరుసదాడులకు పాల్పడి ప్రపంచం ముంగిట పెను సవాలుగా నిలిచింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేరాఫ్‌గా నిలిచిన అల్‌ ఖైదా స్థానంలో ఇప్పుడు ఐఎస్‌ పేరు వినిపిస్తోంది. ఇరాక్‌, సిరియాల్లో ప్రధాన భూభాగాలను ఆక్రమించుకుని ప్రస్తుతం ఈ సంస్థ నిరాఘాటంగా ఉగ్రపంజా విసురుతుండటం విశ్వమానవాళికి వణుకు పుట్టిస్తోంది. 
అమెరికా దురాగతాల ఫలితమే..
ఐఎస్‌ పుట్టుకొచ్చిందీ అల్‌ ఖైదా కుదురునుంచే అని చెబుతున్నా..పురుడుపోసి పాలుపట్టి పోషించింది మాత్రం అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదమే. లౌకిక, ప్రజాతంత్ర దేశాలుగా ఉంటూ తన సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తూ వచ్చిన ఆఫ్గనిస్తాన్‌, లిబియా, ఇరాక్‌, సిరియాల్లో అంతర్యుద్ధాలను రాజేసిన అమెరికా వాటిని మతత్వ పాలనలోకి నెట్టింది. తన కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాలతో పబ్బం గడుపుకుంటూ ఐఎస్‌ లాంటి మతోన్మాద ఉగ్రవాద సంస్థల విస్తృతికి దోహదమైంది. ఇరాక్‌లో మారణాయుధాలున్నాయనే మాట తప్పుడు సమాచారమని, 2003 ఇరాక్‌ యుద్ధకాండ తీవ్ర పొరపాటేనని బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌ ఇటీవలే లెంపలేసుకున్నారు. ఆయన మాటలే అమెరికా అసలు లక్ష్యమేంటో తేటతెల్లం చేశాయి. చమురు సంపదతో విరాజిల్లుతున్న ఇరాక్‌, సిరియాపై పట్టుసాధించేందుకు నాడు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు చేపట్టిన దురాగత దాడులే ఐఎస్‌కు విత్తులేశాయి. ఆయువు పోశాయి. విదేశీ కంపెనీల యాజమాన్యంలోని చమురుబావులను జాతీయం చేసిన ఇరాక్‌ అధ్యక్షుడు సద్దా హుస్సేన్‌ అంతుచూడటమే లక్ష్యంగా చేసుకున్న అమెరికా..మారణాయుధాలున్నాయన్న సాకుతో 2003లో బ్రిటన్‌తో కలిసి దాడులకు పాల్పడింది. దీనిని అంతర్యుద్ధంగా చిత్రీకరించేందుకు ఇరాక్‌లో మైనార్టీలైన సున్నీలకు (సద్దాం తెగ), మెజార్టీలుగా ఉండే షియాలకు చెందిన తీవ్రవాద సంస్థలకు సాయుధ సంపత్తిని సమకూర్చి ఇద్దరీ మధ్య చిచ్చు రాజేసింది. నేరుగా వైమానిక దాడులతో లక్షలాది మంది ప్రజలను పొట్టన పెట్టుకుంది. 2006 డిసెంబరులో సద్దాం హుస్సేన్‌ను పట్టుకొని నిసిగ్గుగా ఉరితీయించింది. ప్రజాస్వామ్యానికి నిలువునా పాతరేసింది. సద్దాం హత్య అనంతరం దిక్కుమొక్కూలేని ఆనాధను చేసి ఇరాక్‌ను అంతులేని సంక్షోభంలోకి నెట్టింది. ఈ క్రమంలోనే ఐఎస్‌ఐఎస్‌ విజంభించటం ఆరంభించింది. మొదట్లో బిన్‌లాడెన్‌ ప్రోద్బలంతో 'అల్‌ ఖైదా ఇన్‌ ఇరాక్‌'గా ఆరంభమైన ఈ సంస్థ 2006 తర్వాత ఆల్‌ ఖైదా నుంచి విడిపోయి 'ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌(ఐఎస్‌ఐ)'గా స్వతంత్ర పొందింది. అబు బాకర్‌ అల్‌-బాగ్దాదీ ఐఎస్‌ఐ పగ్గాలు చేపట్టిన తర్వాత మరింత దూకుడు పెంచింది. ఇరాక్‌, సిరియాల్లోని స్థానిక తీవ్రవాద సంస్థలను విలీనం చేసుకొని 'ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాన్‌ అండ్‌ సిరియా(ఐఎస్‌ఐఎస్‌)'గా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించే లక్ష్యంతో ఏకంగా 'ఇస్లామిక్‌ స్టేట్‌'గానే ఉనికి చాటుకుంటోంది.
ఆటవిక చర్యలు..ఆకర్షణీయ నినాదాలు
ఐఎస్‌.. కరుడుగట్టిన చర్యలకు మారుపేరు. హతమార్చటం, శిలువలు వేయటం, సామూహికంగా కాల్చివేయటం, పాశవికంగా చంపటం, తమను అడ్డుకునే సైనికుల తలలు నరకి ఆ చిత్రాలు చూపిస్తూ భయోత్పాతం సష్టించటం..ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పెట్టి ప్రపంచ దేశాలన్నింటి నుంచీ అభిమానులను ఆకర్షించటం..దీని ప్రత్యేకత. ఇరాక్‌లో సున్నీలు అధికంగా ఉండే ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను ఐఎస్‌ ఆక్రమించేసింది. దేశంలో దాదాపు మూడోవంతు భూభాగాన్ని అధీనంలోకి తీసుకుంది. సిరియాలో ఈశాన్య భాగం మొత్తం వీరి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు వీరిని హతమార్చే పేరుతో ఇరాక్‌, సిరియాల్లో అమెరికా మళ్లీ వైమానిక దాడులకు పాల్పడుతోంది. పారిస్‌ దాడుల నేపథ్యంలో ఫ్రాన్సు వంటి యూరప్‌ దేశాలూ అమెరికాకు వంతపాడుతున్నాయి. దాడుల్లో భాగస్వాములౌవుతున్నాయి. దాడులతో ఇరాక్‌, సిరియాలు నిత్య రణక్షేత్రాలుగా మార్చేశాయి. సున్నీలు-షియాల మధ్య చిరకాల వైరాన్ని ఆసరాగా చేసుకుని..ఇరాక్‌లో సున్నీ మైనారిటీలను రెచ్చగొట్టి షియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు చేయిస్తూ చిచ్చు రాజేసి చోద్యం చూస్తున్నాయి అమెరికా, దాని అనుయాయు దేశాలు.
ప్రస్తుతానికి అంతర్జాతీయంగా ఎదగకపోయినా.. అల్‌ఖైదా కంటే కూడా ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదాన్ని ఎదుర్కొనటం కష్టమన్నది విశ్లేషకులంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఇది అత్యంత సంపన్నమైన తీవ్రవాద సంస్థ. ఇరాక్‌లో అమెరికా సైన్యాలతో పోరాడుతున్న తొలి రోజుల్లో ఆరబ్‌, గల్ఫ్‌ దేశాల నుంచి దీనికి దండిగా నిధులు లభించాయి. ఇప్పుడు ఇరాక్‌, సిరియాల్లోని చమురు బావుల నుంచి రోజుకు కనీసం 9000 బ్యారళ్ల చమురు ఎగుమతి చేస్తూ బిలియన్ల కొద్దీ డాలర్లు ఆర్జిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సిరియా, ఇరాకీ సైన్యాల నుంచి ఆయుధ సంపత్తినీ పెద్దఎత్తునే కొల్లగొట్టారు. షియాలకు వ్యతిరేకంగా పని చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా సున్నీల నుంచి పరోక్ష మద్దతు లభిస్తోంది. ఖలీఫా రాజ్య స్థాపన వంటి ఆకర్షణీయ నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అనుయాయులు పెరిగారు. భారత్‌లోనూ పలువురు యువకులు కూడా దీనిపట్ల ఆకర్షితులవుతున్నట్లు తరచూ వార్తలు వస్తున్నాయి. అందుకే దీన్ని 'అంతర్జాతీయ ముప్పు'గా చెబుతున్నారు. ఇరాక్‌, ఆఫ్గాన్‌లలో గత అనుభవాలను దష్టిలో ఉంచుకుంటే ఐఎస్‌ను అడ్డుకోవటం అంత తేలికేం కాదనీ పేర్కొంటున్నారు. ఐఎస్‌ను అణిచివేయడం అవసరమే అయినా.. అందుకోసం అమెరికా దాని మద్దతు దేశాలు..సిరియాలో తిరుగుబాటుదారులకు ఆయుధాలివ్వటం, ఇరాక్‌లోని షియా ప్రభుత్వానికి మద్దతుగా నిలవటం వంటివి సమర్థనీయ అంశాలు కాదని అమెరికన్లే నినదిస్తున్నారు. దేశాల అంతర్గత వ్యవహారాల్లో జ్యోక్యాలను నిలువరించడం, సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని కట్టడి చేసిననాడే ఉగ్రవాద నిర్మూలన సాధ్యమయ్యేది. 
- బి. అమరనారాయణ