సామాన్లు తీసుకుంటుంటే కూల్చేశారు

సామాన్లు సద్దుకుంటామన్నా ఆగకుండా ప్రొక్లేయిన్ల్‌తో మున్సిపల్‌ అధికారులు, పోలీసు సిబ్బంది ఇళ్లను కూల్చివేయించారని వావిలాలఘాట్‌ వాసులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వావిలాల్‌ఘాట్‌ వాసులు సామన్లు సద్దుకుంటుం డంగానే మంగళవారం సాయంత్రం పోలీసులు బందోబస్తుతో మున్సిపల్‌ అధికారులు వారి ఇళ్లను నేల మట్టం చేసిన విషయం విధితమే. వావిలాలఘాట్‌ పార్క్‌ అభివృద్ధికి వావిలాలఘాట్‌లో నివాసం వుంటున్న 102 కుటుంబాల ఇళ్లను పీకివేసి ఎస్‌పిజి డిగ్రీకళాశాల్లో చూపించిన ప్రత్యామ్నాయ స్థలానికి వెళ్లి ఇళ్లు అక్కడవేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ ట్రాక్టర్‌లతో మున్సిపల్‌ సిబ్బంది వారి సామన్లను ప్రత్యేమ్నాయ స్థలంలోకి తరలించి వేశారు. ఈ సందర్బంగా బుధవారం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య, డివిజన్‌ కమిటీ సభ్యులు వంకాయలపాటి శివనాగరాణి, ఎస్‌ ఆంజనేయులు నాయక్‌ పట్టణ కమిటీ సభ్యులు రొంపిచర్ల పురుషోత్తం దుర్గారావు నాయక్‌లు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదవశెట్టి వేదాద్రి పట్న అధ్యక్షులు దాసరి జ్ఞానరాజ్‌పాల్‌, వైసిపి నాయకులు కోడిరెక్కల దేవదాసు, ప్రముఖ న్యాయవాది చిలకా చంద్రశేఖర్‌ ప్రత్యేమ్నాయ స్థలాల్లో బాధితులను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు మాట్లాడుతూ ఎటువంటి ప్రత్యామ్నాయ చూపకుండా మమ్మల్ని తరలించారని, స్థలంలో గుంటలు వున్నాయని, వాటిలో నీరు వున్నాయని నివాస ఏర్పాటు చేసుకునే వీలులేదని వాపోయారు. అంతేకాకుండా ఈ స్థలాల కొందరు వ్యక్తులు వచ్చి ఈ స్థలాలు మావని మేము కోర్టుకి వెళ్లామని త్వరలో స్టేవస్తుందని ఆ తరువాత మిమ్మల్ని ఖాళీ చేయిస్తామని, ఖాలీ చేయకపోతే నెట్టివేస్తారని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు కాగితాలు చూపిస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా అక్కడ వచ్చిన మున్సిపల్‌ కమిషనర్‌ బి.సాంబశివరావు, పట్టణ సిఐ ఎస. సాంబశిరావులతో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చలమయ్య మాట్లాడుతూ బాధితుల ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించాలన్నారు. గుంటలు పూడ్చి, మేరకలు తొలించాలని అన్నారు. బాధితులకు భోజన సదుపాయం కల్పించాలని ఇళ్ల పుననిర్మాణానికి రూ.10 వేలు ఇవ్వాలని అధికారులను కోరారు. వావిలాలఘట్‌ వాసులకు ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రయివేట్‌ స్థలాల్లో ఎందుకు చూపించారని అధికారులను నిలదీశారు. తాత్కాలికంగా ఈ స్థలంలో ఇళ్లు వేసుకుని నివాసం వుంటుంటే పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని కమిషనర్‌ బి.సాంబశిరావు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులకు స్థానిక సిపిఎం నాయకులు వంటా వార్పు పెట్టి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.