సాంస్కృతిక రాజధానిగా విశాఖ

 విభజన నేపథ్యంలో విశాఖను సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టినట్టు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఎంవిపిలో విశాఖ జూనియర్స్‌ పేరిట ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ భవిష్యత్‌లో విశాఖ అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందనుందన్నారు. విశాఖ జూనియర్స్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, వీటివల్ల బాలలలో ప్రతిభ పాటవాలను వెలికితీసేందుకు దోహదం చేస్తాయని తెలిపారు. పోటీలలో విజేతలుగా ఎవరు గెలిచినప్పటికి అందరు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్‌ మాట్లాడుతూ అయా పోటీల్లో పెద్ద ఎత్తున పిల్లలు పాల్గొనడం అభినందనీయమన్నారు. ఎంసెట్‌తో పాటు అనేక కోర్సులకు సంబంధించి మంత్రి గంటా విశేషంగా కృషి జరిపారని సకాలంలో ఆయా పరీక్షలు నిర్వహించేందుకు మంత్రి కృషి దోహదం చేసిందన్నారు. స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌ మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌తో పాటు ఎంతో మంది ప్రస్తుత సినీనటులకు తాను శిక్షణ ఇచ్చానని భవిష్యత్‌లో కూడా మరింత మంది కళాకారులను తయారు చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.