సమస్యలతో సతమతం

నగరంలో సిపిఎం చేపట్టిన పాదయాత్రలు రెండో రోజుకు చేరుకున్నాయి.. నాయకులు వీధివీధికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికారులకు సమస్యలు అనేక సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని, అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ తమ కాలనీల్లో తొంగి చూడట్లేదని వారు పాదయాత్ర బృందం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పారిశుధ్యం, రోడ్లు, మురుగు కాల్వలు, మంచినీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు తూర్పు నియోజక వర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మురికి వాడలు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, తక్షణమే ఆయా ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. యాత్ర సంగటిగుంట ప్రాంతంలోని ఎల్‌.ఆర్‌.కాలనీ, గాంధీనగర్‌, కొత్తా లక్ష్మారెడ్డి నగర్‌, కబాడీగూడెంలలో పర్యటించింది. అనేక సార్లు రచ్చబండ, జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ రేషన్‌కార్డులు ఇవ్వలేదని ప్రజలు వారి ముందు వాపోయారు. ఎల్‌ఆర్‌కాలనీ, గాంధీనగర్‌ తదితర ప్రాంతాలలో పచ్చ గడ్డి కోసే కూలీలకు అతి తక్కువ కూలి ఇస్తున్నారని, మహిళలకు రూ. రూ.150లు, పురుషులకు రూ.200లు ఇస్తున్నారని పేర్కొన్నారు. పాములు కరిసి ప్రమాదానికి గురైనా పట్టించుకోవట్లేదని తెలిపారు.గుంటూరు పశ్చిమ నియోజక వర్గంలోని యాత్ర బృందం శ్రీనివాసరావుతోట, పీకలవాగు కట్ట, కెవిపి కాలనీ, ఎతిరాజు కాలనీ, వికలాంగుల కాలనీల్లో పర్యటించింది. ప్రధానంగా ఎతిరాజు కాలనీలో నాలుగు రోజుల నుండి కుళాయిల ద్వారా నీరు రావట్లేదని, ట్యాంకర్ల ద్వారా తెచ్చే నీరు సరిపోవట్లేదని స్థానికులు చెప్పున్నారు. శ్రీనివాసరావుతోటలో పొజిషన్‌ సర్టిఫికెట్లు ఉన్న ఇళ్లకు ఇంటిపన్ను వేయకపోవటంతో నీటి కుళాయి ఇవ్వట్లేదని తెలిపారు. అదే విధంగా పీకల వాగు కట్టలో పూడిక తీయటానికి ఉద్దేశించి కాల్వపై నిర్మిస్తున్న రోడ్డు వల్ల కట్లపై ఇళ్లు సగం మేర కోల్పోవాల్సి వస్తుందని నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. శ్రీనివాసరావుతోటలో 15 డ్వాక్రా గ్రూపులు ఉండగా ఒక్క గ్రూపునకు మాత్రమే రుణమాఫీ డబ్బులు వచ్చాయని, మిగిలిన వారికి రాలేదన్నారు