శివారెడ్డి జీవితం ఆదర్శనీయం

సింహాద్రి శివారెడ్డి బాల్య దశ నుండి దేశ స్వాతంత్య్రం కోసం, శ్రమ దోపిడి లేని సమ సమాజం కోసం చేసిన కృషి ఆదర్శనీయమని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. సిపిఎం కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.వేమారెడ్డి అధక్షతన సింహాద్రి శివారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత శివారెడ్డి చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు కొండా శివరామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ శివారెడ్డి కుల, మతాలకు అతీతంగా కష్టజీవులను ఐక్యం చేయటంలో అనితర సాధ్యమైన కృషి చేశారని శ్లాఘించారు. జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో శివారెడ్డి పాత్ర కీలకమన్నారు. అనేక రైతాంగ, వ్యవసాయ కార్మిక ఉద్యమాలను నడిపి విజయం సాధించారన్నారు.కమ్యూనిస్టు ఉద్యమానికి ఆటుపోట్లు ఎదురైనపుడు జిల్లాలో దృఢంగా నిలచారన్నారు. సిపియం నగర కార్యదర్శి ఎన్‌ భాన్నారాయణ మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పార్టీ ఇచ్చిన పిలుపు నందుకొని తన వాటకు వచ్చిన ఆస్తిని అమ్మి పార్టీ అభివృద్ధికి వినియోగించారన్నారు. ప్రజా ఉద్యమాల్లో శివారెడ్డి చేసిన కృషిని గుర్తించటంతో పాటు, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆచరించాలన్నారు.