వినాశనం చేస్తారా..?

కొవ్వాడ అణుపార్కును ఏర్పాటు చేస్తూ ఉత్తరాంధ్రను వినాశనం చేస్తారా అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. కొవ్వాడ అణుపార్కును వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యాన 102 మంది కార్మికులు మంగళవారం రక్తదానం చేశారు. మండలంలోని అరిణాం అక్కివలసలో శ్యామ్‌పిస్టన్స్‌ ప్లాంట్‌-3 పరిశ్రమ వద్ద చేపట్టిన ఈ రక్తదాన శిబిరాన్ని నర్సింగరావు ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న దేశాల్లో నిషేధిస్తున్న ఇలాంటి పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, ప్రజలకు భద్రత లేని, అవసరాలు తీర్చని పరిశ్రమలను వద్దం టున్నామని స్పష్టం చేశారు. తమ హక్కుల కోసమే కాకుండా సామాజిక బాధ్యతనూ ట్రేడ్‌ యూనియన్లు నిర్వర్తిస్తున్నాయన్నారు.
ట్రేడ్‌ యూనియన్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ
పరిశ్రమల ద్వారా వస్తున్న ఆదాయంలో రెండు శాతం సామాజిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని నిబంధన ఉన్నా, సంపూర్ణంగా అమలు చేయడం లేదని చెప్పారు. అరబిందో ఫార్మా యాజమాన్యానికి ఏడాదికి రూ.15వేల కోట్లు ఆదాయం వస్తుండగా, రూ.300 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని, పావు వంతు కూడా ఖర్చు చేయడం లేదన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కమిటీ (టియుఎస్‌ఆర్‌)ని ఏర్పాటు చేసి, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. విశాఖటప్నంలో కోరమాండల్‌ ఫెర్టిలైజర్స్‌ పరిశ్రమ కార్మికులు ప్రతి నెలా ఒక్కొక్కరి నుంచి రూ.20చొప్పున వసూలు చేసి, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తుచేశారు.
అనంతరం అణుపార్కు వల్ల కలిగే నష్టాలను వివరించే ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ప్రాణాలను హరించే వినాశకర అణుపార్కు వద్దని చేపట్టిన ఈ శిబిరంలోసిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, సంజీవిని పర్యావరణ పరిరక్షణ సంస్థ అధ్యక్షులు కూన రామం పాల్గొన్నారు. రెండు సార్లు పెద్దసంఖ్యలో రక్తదానం చేసిన శ్యామ్‌పిస్టన్స్‌ కార్మికులకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాన్ని అందించారు.