విఠంరాజుపల్లి అగ్నిప్రమాదంలో సర్వకోల్పోయినబాధితులకు సిపిఎం సాయం

ప్రమాదాలు జరిగిన వెంటనే మానవతా దృక్ఫథంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. వినుకొండ మండలం విఠంరాజుపల్లి ఎస్సీకాలనీలో గత నెల 20వ తేదీన గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిళ్లు, పొగాకు కొస్టాలు దగ్ధమై తీవ్ర నష్టంవాటిల్లి బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలారు. విజయవాడ పాపులర్‌ షూమార్ట్‌ వారి సహకారంతో దుప్పట్లు, టవళ్లు, ఇనుప మంచాలు సోమవారం విఠంరాజుపల్లి బాధిత కుటుంబాలకు సిపిఎం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని సుమారు రూ.50లక్షల ఆస్తినష్టం వాటిల్లడం బాధాకరమన్నారు.బాధితులను ఆదుకునేందుకు వైసిపి, శివశిక్తి ఫౌండేషన్‌, గ్రామ సర్పంచ్‌, బాలాజీ ఎస్టేట్‌ నిర్వాహ కులు సాంబశివరావు, పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారు పేదలని, వారిని ఆదుకొని ఎన్‌టిఆర్‌ గృహకల్ప పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలకు అతీతంగా సహకరించి బాధిత కుటుంబాలు న్యాయం చేయాలని కోరారు. డివిజన్‌ కార్యదర్శి కె. హనుమంతరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. విఠంరాజుపల్లి సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇటీవల బాధితులకు సహాయం చేసిందన్నారు. అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. బాధిత ఒక్కో కుటుంబానికి ఇనుప మంచం, దుప్పటి, నవారు, కండువాను అందజేశారు.