'వంశధార' పనులు నిలిపేయాలి : సిపిఎం

 వంశధార నిర్వాసితులకు పునరావాసం, 2013 ఆర్‌అండ్‌ఆర్‌ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, అప్పటివరకూ పనులు నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ సీతారామారావును సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోరాడ నారాయణరావు, వంశధార నిర్వాసిత సంఘం ప్రతినిధి జి.సింహాచలం వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ జలాశయం పనులు చేపట్టి దశాబ్దకాలం పూర్తయినా నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పంచలేదని తెలిపారు. ధరలు పెరిగినా, చట్టాల్లో మార్పు వచ్చినా ఒక నిర్దిష్ట కాలంలో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ప్రభుత్వ విధానం వల్ల పనులు పూర్తికాలేదని, నిర్వాసితులు నష్టపోయారని పేర్కొన్నారు. నిర్ణీత కాలంలో పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించి, జలాశయం పనులు పూర్తి చేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన యువతకు యూత్‌ ప్యాకేజీ అమలు చేసి, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు తెలిపారు. ప్రాజెక్టు భూములకు ఇచ్చిన నష్టపరిహారాన్ని పున సమీక్షించి, రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల్లో చెల్లిస్తున్నట్లు ఇవ్వాలని కోరారు.