రైతులకు బెదిరింపులు..

రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులపై రాష్ట్ర మంత్రులు బెదిరింపులకు దిగుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలనే వ్యూహానికి సర్కారు దిగడం దారుణం. ఒకరి తరువాత ఒకరిగా మంత్రులు రైతులు భూములు ఇచ్చేయాల్సిందేనంటూ బెదిరింపుల పర్వాన్ని ప్రారంభించడం, డెడ్‌లైన్‌ చెప్పి మరీ హెచ్చరించడం దుర్మార్గం. తాము చెప్పిన తేదీ లోగా ఇవ్వకుంటే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించైనా గుంజుకుంటామని హెచ్చరించడం రైతులను గందరగోళ పరిచి, తీవ్ర ఒత్తిడికి గురి చేసే ఎత్తుగడే! మంత్రులు చేసే హెచ్చరికలు చాలవన్నట్టు భూములివ్వని రైతులను స్థానికంగా ఎక్కడికక్కడ టార్గెట్‌ చేసి వేధింపులకు గురి చేయడం, పచ్చటి పంటలకు నిప్పు పెట్టడం, తప్పుడు కేసులు బనాయించి పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పడం, పల్లెలకు పల్లెలను పోలీసు ఠాణాలుగా మార్చి కనీస నిరసనలకు అవకాశం ఇవ్వకపోవడం సర్కారు దురాగతాలకు పరాకాష్ఠ. సొంత ప్రజానీకంపై ఇంతగా కసి కట్టి కత్తి దూసిన ప్రభుత్వం సమకాలీనంలో మరొకటి కనిపించదు. ప్రభుత్వం నుండి ఈ స్థాయిలో ఒత్తిడి వస్తున్నా రైతాంగం ఒప్పుకోవడం లేదంటే వారిలో ఉన్న వ్యతిరేకతను, భూమిపై వారికున్న ఆపేక్షను అర్ధం చేసుకోవచ్చు. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి బదులుగా విపక్షాల కుట్ర అంటూ విమర్శలకు దిగడమూ చంద్రబాబు సర్కారుకే చెల్లుతుంది. 
రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న ధోరణిలో వ్యవహరించింది. అన్ని ప్రజాస్వామిక విలువలను నీరు గారుస్తూ నియంతృత్వ పోకడ పట్టింది. ప్రజా సంఘాలను, విపక్షాలను విస్మరించింది. చివరికి ఏ భూములనైతే తీసుకోవాలనుకుందో ఆ భూముల యజమానులైన రైతులనూ బేఖాతరు చేసింది. ఒక్కరితో ఒక్క మాట చెప్పకుండా, కనీస చర్చ జరపకుండా సమీకరణ యుద్ధభేరిని మోగించింది. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి ఒక్క రూపాయీ పరిహారం ఇవ్వకుండానే రైతుల నుండి వేలాది ఎకరాల భూములు గుంజుకుంది. అన్ని వేల ఎకరాలు ఎందుకుని ప్రశ్నించినా, పర్యావరణానికి పెను ప్రమాదం అని హెచ్చరించినా అపహాస్యం చేసింది. పచ్చటి పంట పొలాలపై కార్పొరేట్‌ రాబందుల రెక్కల చప్పుడుకు డప్పులు మోగించి ఎర్ర తివాచీ పరిచింది. పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లతో అట్టహాసంగా నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం అభాసు పాలైన తరువాత, ప్రతిష్ఠాత్మక వార్తా ప్రసార సంస్థ బిబిసి రాజధానిలో మృగ్యమౌతున్న మానవ హక్కుల గురించి అంతర్జాతీయ స్థాయిలో కడిగిన తరువాత కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం కరుడుగట్టిన తనానికి నిదర్శనం. 
రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని ఒకవైపు దేశ, విదేశాల్లో ప్రచారం చేసుకుంటూ తాజాగా బెదిరింపుల పర్వానికి దిగడం ఎందుకో అర్థం కాని స్థితి. బెదిరింపులూ పని చేయవని భావించిన చోట పంటలను దహనం చేయడం వంటి హేయమైన పనులకు దిగుతున్నారు. కొద్ది రోజుల క్రితం మల్కాపురంలో చెరకు తోటను దహనం చేయడం దీనికో ఉదాహరణైతే, తాజాగా ఆ తోటను యజమానే తగల బెట్టుకుని తప్పుడు ప్రచారం చేశారంటూ కేసు బనాయించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ వస్తున్న వార్తలు ఆందోళనకరం. ఇదే నిజమైతే ప్రభుత్వ దిగజారుడు తనానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదు. సేకరణ చట్టంతోనైనా భూములు గుంజు కుంటామని బెదిరిస్తున్న ప్రభుత్వం ఆ చట్టాన్ని ఆచరణలో నూటికి నూరుపాళ్లు అమలు చేయడానికి సిద్ధ పడగలదా? చట్ట ప్రకారం పర్యావరణ, సామాజిక ప్రభావ నివేదికను రూపొందించాలి. దానిని బహిరంగంగా ప్రకటించాలి. గ్రామగ్రామానా సభలు పెట్టి నివేదికపై చర్చ నిర్వహించాలి, బాధిత రైతాంగ అభిప్రాయాన్ని సేకరించాలి, 80 శాతం మంది రైతుల అంగీకారాన్ని సాధించాలి. సంతృప్తికరమైన నష్ట పరిహారాన్ని చెల్లించాలి. వ్యవసాయ కార్మికులను, ఇతర వృత్తిదారులనూ విస్మరించడం సాధ్యం కాదు. ఇవన్నీ చేసినా రైతులకు న్యాయ స్థానాలను ఆశ్రయించే హక్కు ఉండనే ఉంది. అసలు చట్ట ప్రకారమే సాగు నీటి సౌకర్యంతో పాటు, బహుళ పంటలు పండే భూములను సేకరించడం కుదరదు. చట్టంలో ఇన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు ప్రభుత్వం తిమ్మిని బమ్మిని చేసే సమీకరణ మాయోపాయానికి తెర తీసింది. అది కూడా పూర్తి స్థాయిలో ఫలితమివ్వకపోవడంతో ఇప్పుడు హూంకరింపులకు, బెదిరింపులకు దిగుతోంది. మానుకోవాలి. లేనిపక్షంలో ప్రభుత్వానికే నష్టం.