రైతులకు అండగా..:కృష్ణమూర్తి

భోగాపురంలోని ఎయిర్‌ పోర్టు బాధిత రైతులను, ప్రజలను మోసగించే ధోరణిని ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు మానుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా మండలం లోని కౌలువాడలో రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకూ పరిశ్రమల పేరుతో తీసుకున్న భూముల్లో ఎక్కడా పరిశ్రమలను స్థాపించలేదన్నారు. బాధితుల ఆందోళనను, వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, ఆగస్టు 31న అర్ధరాత్రి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎయిర్‌పోర్టు, పరిశ్రమల పేరుతో పేద రైతుల పచ్చని పొలాలను బలవంతంగా తీసుకునేందుకు జరుగుతున్న కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.