రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బాక్సైట్‌ తవ్వకాల శ్వేతపత్రంపై సిపియం వ్యతిరేకం.-రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. నరసింగరావు

           విశాఖ జిల్లా జర్రెల బాక్సైట్‌ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తి అవాస్తవాలతో వున్నది. జర్రెల బాక్సైట్‌ గనుల్లో అపార నిల్వలు వున్నాయని, ఈ నిల్వలను వెలికితీసి రాష్ట్రానికి ఆదాయం పెంచవచ్చని ప్రభుత్వ ప్రధాన వాదన. తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల జారీచేసిన బాక్సైట్‌ తవ్వకాల జి.వో.నెం.97కు ముందే కాంగ్రెస్‌ మరియు వైఎస్‌ఆర్‌ పార్టీలు బాక్సైట్‌ తవ్వకాల పర్యావరణ అనుమతుల జి.వో జారీచేశాయని, రస్‌ ఆల్‌ఖైమాతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని మరో వాదన.  బాక్సైట్‌ అత్యధికంగా వున్న ఒరిస్సాలో తవ్వకాలు జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ తవ్వకాలు ఎందుకు జరపకూడదనేది మూడవ వాదన. 19 పేజీల శ్వేతపత్రంలో అత్యధికం మరకలే కనిపిస్తున్నాయి. బాక్సైట్‌ తవ్వకాల చేయడానికి అనుకూలమైన వాదనలతో ప్రజలను నమ్మించడానికి రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుందని ఈ రోజు విశాఖపట్నం సిపియం ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్లో సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యలు సిహెచ్.నరసింగరావు గారు అన్నారు.

                విశాఖ జిల్లాలోని జర్రెల, సప్పర్ల ప్రాంతాలు భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5కు సంబంధించిన హక్కులతో ఉన్న గిరిజనులు ముఖ్యంగా పిటిజిలు అక్కడ వేలాది మంది జీవిస్తున్నారనేది వాస్తవం. ప్రభుత్వ లెక్కల ప్రకారం 62 గ్రామాల్లో 17వేల మంది గిరిజనులపై తీవ్ర ప్రభావం వుంటుందని గతంలో వారి నివేదికలో పేర్కొన్నారు. కాని వాస్తవానికి ప్రత్యక్షంగా 247 గ్రామాల్లో 50 వేల మందికి పైగా జనాభాపై తీవ్ర ప్రభావం వుంటుంది. వీరి జీవనం ద్వంసమౌతుంది. పర్యావరణం నాశనమౌతుంది.  నాలుగు జిల్లాల్లో నీటి కాలుష్యంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర యిబ్బందులకు గురౌతారు. మైనింగ్‌ మాఫియా ప్రవేశిస్తుంది. విశాఖ ఏజెన్సీ మొత్తం ప్రాంతంలో మైనింగ్‌ మాఫియా రాజ్యమేలుతుంది. 9 కంపెనీలు మైనింగ్‌ చేయడానికి ఉత్సాహంగా వున్నారని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రైవేట్‌ మైనింగ్‌ కంపెనీలు మైనింగ్‌ జరిగే ప్రాంతాల్లో ప్రజలను తీవ్ర యిబ్బందులకు గురిచేయడమనేది దేశంలోని అన్ని ప్రాంతాల అనుభవం. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ చేయడానికి ఎపిఎండిసికి శిఖండిలా అడ్డుపెట్టి ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం, ఆ కంపెనీల నుంచి కిక్‌బాగ్స్‌ సంపాధించడం వీరి ప్రధాన ఉద్దేశ్యం. విలువైన సంపదను విదేశాలకు కారుచౌకగా ఎగుమతి చేయడం దేశద్రోహమే తప్పా ఇందులో దేశ ప్రయోజనాలేవి లేవు. శ్వేతపత్రం ఈ వాస్తవాలను మరుగుపర్చి రాష్ట్ర ఆదాయం కోల్పోతామని ప్రచారం చేయడం దుర్మార్గం.  గిరిజన ప్రాణాలు, పర్యావరణం ముఖ్యం తప్ప మైనింగ్‌ చేయడమే ముఖ్యంకాదు.

                తెలుగుదేశం, కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అధికారంలో వున్నప్పుడు బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా అన్ని ప్రయత్నాలు చేయడం, అధికారంలో లేనప్పుడు బాక్సైట్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం గత 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న నాటకం. టిడిపి అధికారంలో వున్న 1999 నుంచి 2004 వరకు బాక్సైట్‌ మైనింగ్‌ చేయడానికి ఆటంకాలు ఏర్పడితే 1/70 చట్టాన్ని కూడా సవరించాలని నాటి గిరిజన శాఖా మంత్రి శ్రీమతి మణికుమారి అధ్యక్షతన తెలుగుదేశం ప్రభుత్వం ట్రైబల్‌ ఎడ్వైయిజరీ కమిటీ సమావేశంలో తీర్మానించింది. ఆర్‌ఎఫ్‌ ఎమరైడ్స్‌కు సంబంధించిన దుబాల్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయని ఆనాడు స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖ ఏజెన్సీలోను, రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో తీవ్ర నిరసన పెల్లుబుక్కింది. ఆనాటి గవర్నర్‌ శ్రీ రంగరాజన్‌ జోక్యం చేసుకొని మైనింగ్‌ ప్రయత్నాలను నిలుపుదల చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు తేది: 27-4-2012న ప్రస్తుత గవర్నర్‌ వి.ఎల్‌.నరసింహన్‌ గార్కి స్వయంగా తెలిపారు. కాని అదే విషయాన్ని మీ శ్వేతపత్రంలో ఎందుకు పేర్కొనలేదు. మీరు అధికారంలోని కాలంలో బాక్సైట్‌ కోసం చేసిన ఒప్పందాలను వివరంగా వ్రాసి మీరు చేసిన ప్రయత్నాలను ఉద్దేశ్యపూర్వకంగానే పేర్కొకపోవడం శ్వేతపత్రం అవుతుందా?

                భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో బాక్సైట్‌ మైనింగ్‌ జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు జరపకూడదనే వాదను శ్వేతపత్రం ముందుకు తెచ్చింది. ఒరిస్సాలోని నాల్కో కంపెనీ కోసం మైనింగ్‌ జరుపుతున్న థామన్‌జోడి ప్రాంతంలో గిరిజన ప్రాంతంగాని, నివాసప్రాంతాలు గాని లేవు. అంతకంటే ప్రధానంగా 5వ షెడ్యూల్‌ పరిధి క్రింద ఈ ప్రాంతం లేదు. అందువల్ల దేశంలోనే అత్యధికంగా మైనింగ్‌ జరుగుతున్న థామన్‌జోడికి, జర్రెల్లో బాక్సైట్‌కు పోలికేలేదు.

                జర్రెల పంచాయితీ 2008లో తీర్మానం చేసినట్లు శ్వేతపత్రంలో పేర్కొనడం అవాస్తవాం. ఈ పంచాయితీ ఎన్నడూ అటువంటి తీర్మానం చేయలేదని పంచాయితీ పెద్దందరూ వాధిస్తున్నారు. పీసా చట్ట ప్రకారం గ్రామ సభకు అధికారాలు వున్నాయి తప్ప పంచాయితీకి ఎటువంటి అధికారాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 18 నెల కాలంలో ట్రైబల్‌ ఎడ్వైయిజరీ కమిటీని నేటికీ ఎందుకు నియమించలేదు? పీసా చట్టప్రకారం గ్రామసభలు వెంటనే జరపాలని సిపిఎం పార్టీ పలుసార్లు ఈ ప్రభుత్వాన్ని కోరింది. అటవీ హక్కుల చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వం కనీసం కమిటీలను సైతం ఎన్నికలు జరపలేదు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కావాలనే అటవీహక్కు చట్టం ప్రకారం భూ పట్టాలు ఇవ్వకుండా నష్టపరిహారం కూడా చెల్లించకుండా భూములు లాక్కొవాలనే కుట్రతోనే ఉన్నది. తాత్కాలికంగా తప్పించుకోవడానికే ‘‘ గిరిజనులతో చర్చిస్తాం, చర్చించిన తరువాత నిర్ణయిస్తాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ మైనింగ్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం, పోలీసులు, సైన్యాన్ని దించడానికి సన్నద్దం చేయడానికి సమయం తీసుకోవడమే వీరి లక్ష్యంగా వుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

                బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈనె 30 వ తేదీన సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీమతి బృందాకరత్‌ విశాఖ ఏజెన్సీలో పర్యటన జరుగుతుంది. చింతపల్లిలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగే ‘‘గిరిజన గర్జన భారీ బహిరంగసభ’’లో పాల్గొని ప్రసంగిస్తారు.  దీనిలో గిరిజనలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాని కోరుతున్నాం.