రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ - సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు

 

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి
         రాయలసీమకు తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని అన్నారు. లోటు బడ్జెట్‌ను పూరిస్తామని చట్టంలో ఉందని గుర్తు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని చట్టంలో ఉందని, ఇచ్చిన హామీ మేరకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్ర విద్యా సంస్థలతోపాటు వృత్తి శిక్షణనిచ్చే పాలిటెక్నిక్‌ కళాశాలలను రెవెన్యూ డివిజన్‌కు ఒకటి, మండలానికి ఒక ఐటిఐ ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక హోదాపై బిజెపి, టిడిపి మరోమారు మోసం చేసేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా లేదని మంత్రి చెబుతుంటే అది రాష్ట్రానికి సంబంధం లేదని మాయ మాటలు చెబుతు న్నారని అన్నారు. రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లపై సిపిఎం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని ఈనెల 14 వరకు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు పాల్గొన్నారు.
ప్రతిపాదిత ఆయకట్టుకు నీరివ్వాలని విపక్షాల డిమాండ్‌ హంద్రీనీవా మొదటి దశ కిందనున్న ప్రతిపాదిత ఆయకట్టుకు నీరివ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఉరవకొండలో హంద్రీనీవా తొలిదశ ఆయకట్టు రైతుల ఆధ్వర్యంలో సోమవారం సదస్సు జరిగింది. సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, వైసిపి ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు, వైసిపి ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు కెవి రమణ మాట్లాడారు. హంద్రీనీవా కాలువ మొదటి దశ కిందనున్న డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం నిలిపేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రతిపాదిత ఆయకట్టుకు తప్పకుండా నీరివ్వాలని డిమాండ్‌ చేశారు.