మోడీ పాలనలో పెరుగుతున్నఅసహనం..

మాజీ ఉప ప్రధాని, బిజెపి సీనియర్‌ నాయకులు లాల్‌కృష్ణ అద్వానీ గతంలో ఒకసారి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని గొప్ప 'ఈవెంట్‌ ఆర్గనైజర్‌'గా వర్ణించారు. ఎల్‌కె అద్వానీని బిజెపి, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) విస్మరించింది. అయినప్పటికీ దేశ ప్రజానీకం అద్వానీని, ఆయన నాయకత్వాన్నీ ఇంకా గుర్తు పెట్టుకున్నది. ప్రధాని మోడీ ప్రస్తుతం దేశాలు పర్యటించడం, విదేశీ ప్రధానులు, అధ్యక్షులు, బడా పెట్టుబడిదారులకూ ఆతిథ్యం ఇస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మోడీ దేశ ప్రజానీకానికి ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారనే విషయం కూడా నిక్కచ్చిగా చెప్పవచ్చు. అదేమంటే 'మినిమమ్‌ గవర్నమెంట్‌.. మాగ్జిమమ్‌ గవర్నెన్స్‌' అని ఆయనిచ్చిన నినాదం అక్షరాలా మరచిపోయారు. కేబినెట్‌ ఏర్పాటు చేసిన కొత్తలో కొంతమేర ఈ నినాదాన్ని పాటించినట్టు కనిపించినా, అటు తర్వాత గాలికొదిలేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం.
ఇంకో విషయం.. దూషణతో కూడిన మత విద్వేషాలు రెచ్చగొట్టే అల్లరిమూకలకు ప్రభుత్వమే ప్రోద్బలమిస్తున్నదని ఇక్కడ అవగతమవుతున్నది. మత ధ్రువీకరణ అనేది పక్కాగా జరుగుతున్నది. మత విద్వేషాలు కింది స్థాయిలోని అల్లరిమూకలు చేస్తున్న పనిగా చెబుతున్నప్పటికీ వాటిలో సంఫ్‌ుపరివార్‌ కీలక నాయకులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో అల్లరిమూకలకూ, ప్రభుత్వానికీ మధ్య ఏమాత్రం తేడా లేకుండా పోయింది. ప్రభుత్వ ప్రోద్బలంతో మత వేర్పాటు చర్యలు జరుగుతున్నాయని చెప్పడానికి మనం మరో కారణం కూడా తెలుసుకోవచ్చు. అదేమిటంటే, మత వేర్పాటు రాజకీయాలు చేసిన వారిని చట్టపరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని తిరస్కరించడమే. నరేంద్రమోడీ భారత ప్రధాని అయినప్పటి నుంచీ ఆయన మంత్రివర్గసభ్యులు ఏదో ఒక రూపంలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని దేశ ప్రజానీకం కూడా ఆశిస్తున్నది. పార్లమెంటులో కూడా ప్రతిపక్షాల నుంచి ఇదే డిమాండ్‌ను ఎన్‌డిఎ ప్రభుత్వం ఎదుర్కొన్నది. ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని ప్రధాని కనీసం హామీనైనా ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరాయి. అయితే ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వకపోగా, అసలీ అంశాన్నే మరుగు పరచింది. ఇలా ప్రభుత్వం తనను తాను సమర్థించుకోవడం వల్ల మోడీ సర్కారుకూ, అల్లరి మూకలకూ తేడా లేకుండా పోయిందని కళ్ళకు కట్టినట్టు అర్థమవుతున్నది.
కేంద్ర మంత్రులు, బిజెపి ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు పార్లమెంటు ముక్తకంఠంతో ప్రధానమంత్రిని నిలదీసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పదవి నుంచి తప్పించి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. పాత ధోరణిలోనే ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించింది. పైగా ప్రభుత్వం, బిజెపి నాయకత్వం ప్రతిపక్షాలే పార్లమెంటు సమావేశాల సమయాన్ని వృథా చేస్తున్నాయని ప్రచారం చేశాయి. సభ జరిగినంత కాలమూ ప్రతిపక్షాల డిమాండ్‌పై ప్రభుత్వం ఇదే మొండి పట్టుదలపై ఉన్న సంగతి అందరూ గమనించిందే. ప్రస్తుతం ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో తలమునకలై ఉన్నారు. నవంబర్‌ 25వ తేదీ లోపు మరో నాలుగు దేశాలు తిరిగేందుకు సంసిద్ధులయ్యారు కూడానూ. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇదో పెద్ద ప్రశ్న కానుంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్‌ 16వ తేదీన ప్రారంభం కావాలి. కానీ ప్రధాని సమావేశాల విషయం విడిచిపెట్టి విదేశాల్లో పర్యటిస్తున్నారు. అందుకని పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం లేనట్టే కనిపిస్తున్నది. అయితే ప్రధాని సభకు హాజరు కాకపోయినా ఆయన స్వయంగా పార్లమెంటు ఉభయ సభలూ నడపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు చెబితే మినహా సమావేశాలు ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. అయినప్పటికీ ప్రధాని పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కూడా విదేశీ పర్యటనలు చేయనూ వచ్చు. బహుశా గుజరాత్‌ మోడల్‌ పాలన అంటే ఇదే కావచ్చు.
మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ఏడాది కాలంలో అసెంబ్లీ సమావేశాలు సగటున 31 రోజులు మాత్రమే జరిగిన విషయం విదితమే. అదే సమయంలో పార్లమెంటు ఉభయ సభలూ ఏడాది కాలానికి సగటున 66 రోజులు జరిగిన చరిత్ర ఉన్నది. అయితే పార్లమెంటు సమావేశాలు సంపూర్ణంగా జరిగేందుకు వామపక్షాలు ఒక అంశాన్ని ప్రధానంగా తెరపైకి తెస్తున్నాయి. ఉభయ సభలూ కనీసం వందరోజుల పాటు నడిపే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని అవి డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ బహిరంగసభల్లో తన వాక్చాతుర్యంతో అదరగొడుతున్నారు. కానీ చట్టసభల్లో మాత్రం ఆయన హాజరు నామమాత్రంగా ఉంటున్నది. గుజరాత్‌లోని ఓ సామాజిక మాధ్యమం తెలిపిన వివరాల ప్రకారం మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో మూడుసార్లకు మించి శాసనసభలో మాట్లాడలేదని స్పష్టం చేస్తున్నది. ఆ మూడోసారి మాట్లాడిన సందర్భం కూడా ఏదో సంతాప తీర్మానం చదివే సమయంలోనే అని తెలిపింది. ఈ లెక్కన ప్రధాని మోడీ దృష్టిలో భారత పార్లమెంటు కూడా అదే ధోరణిలో నడవాలేమో?
మోడీ ప్రభుత్వంలోని కొందరు సీనియర్‌ మంత్రులు దేశంలో పెరుగుతున్న అసహనంపై నిరసనల గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. పరుష వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసహనంపై రచయితలు తమ సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగిచ్చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ సినిమా, సాహిత్యకారులు, చరిత్రకారులు, హైదరాబాద్‌లో గల సిసిఎంబి వ్యవస్థాపకులు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ పిఎం భార్గవ తన పద్మభూషణ్‌ (దేశంలో మూడో అత్యున్నత అవార్డు) అవార్డు కూడా ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేశారు. ఈ విధమైన నిరసనలు దేశంలో పెరుగుతున్న కొలదీ సంఫ్‌ుపరివార్‌ శక్తులు కొత్త ప్రచారానికి తెరలేపాయి. అందులో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్‌ 'సరైన మత అసమతుల్యత' ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవల వెల్లడైన జనగణన ప్రకారం దేశంలో ముస్లింల సంఖ్య హిందువుల కంటే గణనీయంగా పెరుగుతుందన్నది సంఫ్‌ుపరివార్‌ శక్తుల ప్రధాన ఆవేదన. హిందువుల జనాభా వృద్ధి పెద్దగా మెరుగవ లేదనేది వారిని వేధిస్తున్న మరో అంశం. అయితే ఏ మైనారిటీ మతం కూడా జనాభాలో కొంతమేర వృద్ధి రేటు ఉన్నప్పటికీ మెజారిటీ మతం కాలేదన్న విషయం సుస్పష్టం. ఇంకా ఆర్‌ఎస్‌ఎస్‌, దాని పరివార శక్తులు దీన్నే ఆధారంగా చేసుకొని దేశంలో ఏదో అపశృతి చోటుచేసుకున్నట్టు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తే ప్రజాస్వా మ్య హక్కులు, పౌరస్వేచ్ఛ రద్దు చేసిన ఎమర్జెన్సీ రోజుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ యత్నం గుర్తుకు వస్తున్నది. దీన్నిబట్టి చూస్తే కుహనా జాతీయవాదులు, కుహనా హిందూ ప్రభుత్వం కుహనా పరిపాలన సాగిస్తున్నదని చెప్పవచ్చు.
సీతారాం ఏచూరి