మున్సిపల్‌ సమ్మె కొనసాగుతుంది...

మున్సిపల్‌ కార్మికులతో మంత్రులు శనివారం రాత్రి పొద్దుపొయ్యేంతవరకు రాజమండ్రిలో జరిపిన చర్చలు విఫలమైనాయి. విధిలేని పరిస్థితుల్లో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జెఎసి ప్రకటించింది. పుష్కర విధులనూ బహిష్కరించాలని, పుష్కరాలు జరుపుతున్న ప్రాంతాల్లో పర్మినెంట్‌ ఉద్యోగులతో కలిసి సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించింది. మరోవైపు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జెఎసి ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవిధక సమ్మె శనివారానికి రెండో రోజుకు చేరుకుంది. పలు జిల్లాల్లో కార్మికులు ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించి నిరసన తెలిపారు. పిఆర్‌సి ప్రకారం రూ.15,432 కనీస వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. 
విశాఖ రూరల్‌ నర్సీపట్నంలో సిఐటియు ఆధ్వర్యాన, యలమంచిలిలో ఎఐటియుసి ఆధ్వర్యాన మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగులు విధులను బహిష్కరించారు. వీరికి ఐద్వా, సిఐటియు, కెవిపిఎస్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. నర్సీపట్నం ఆర్‌డిఒ కార్యాలయం నుంచి స్థానిక పాలఘాట్‌ వరకూ ప్రదర్శనగా వెళ్లి మానవహారం నిర్వహించారు.. దీంతో ట్రాఫిక్‌కు గంటన్నపాటు అంతరాయం ఏర్పడింది. 
కర్నూలులో వివిధ మున్సిపాలిటీల కార్మికులంతా పాత బస్టాండ్‌లోని అంబ్కేర్‌ విగ్రహం వద్ద సమావేశమయ్యారు. నిరసన ప్రదర్శన చేశారు. అనంతపురం జిల్లాలోని అన్ని మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట నిరసన ర్యాలీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని నగరపాలక కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కార్మికులకు సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌, వైఎస్సార్‌సిపి నాయకులు, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం కార్మికులు ర్యాలీగా వెళ్లి సప్తగిరి సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టారు. 
శ్రీకాకుళం పట్టణంలోని పొట్టిశ్రీరాములు కూడలి వద్ద మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు మానవహారం చేపట్టారు. పిఆర్‌సి ప్రకారం రూ.15,432 కనీస వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ కార్మికులను ద్దేశించి ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి హాజరై మద్దతు ప్రకటించారు. శాసనమండలిలో ఈ సమస్యపై చర్చిస్తానని చెప్పారు. కడప నగరపాలక సంస్థతో పాటు ఎనిమిది మున్సిపాలిటీల్లో కార్మికులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు కడపలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు మద్దతు తెలిపారు. రాజంపేట, ప్రొద్దుటూరు, రాయచోటి, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, బద్వేలు మున్సిపాలిటీల్లో ర్యాలీలు నిర్వహించారు. విజయవాడలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక జెఎసి ఆధ్వర్యంలో వన్‌టౌన్‌లోని నెహ్రూబొమ్మ సెంటర్‌, పటమటలోని ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ కూడలిలో మానవహారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మె విరమించేది లేదన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ప్రధాన కూడలిలో, నందిగామ గాంధీబొమ్మ సెంటర్‌లో, గుడివాడలో మానవహారం నిర్వహించారు. మచిలీపట్నంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తిరువూరు, ఉయ్యూరు, పెడనలో దీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లి, నరసరావుపేటల్లో మానవహారం నిర్వహించారు. వినుకొండ, తెనాలిల్లో ధర్నా చేపట్టారు. సత్తెనపల్లిలో ర్యాలీ,రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో 1500మంది పారిశుధ్య కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు స్తంభించాయి. ఒంగోలు నగరంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. మిగిలిన అన్ని మున్సిపల్‌ కార్యాలయాల ఎదుటా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని మున్సిపల్‌ కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగాయి. రెండో రోజూ సమ్మె సంపూర్ణంగా జరగడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్యం క్షీణదశకు చేరింది.