మున్సిపల్‌ కార్మికులపై పాశవిక దాడి

మున్సిపల్‌ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో ఛలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి యత్నాన్ని పోలీసులు శుక్రవారం అడుగడుగునా అడ్డుకున్నారు. మహిళలను సైతం విచక్షణ రహితంగా లాగిపారేస్తూ పాశవికంగా వ్యవహరించారు. మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది మున్సిపల్‌ పారిశుద్య కార్మికులు, వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచిన వామపక్ష పార్టీలకు చెందిన నాయకులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీని పోలీసులు పాత బస్టాండ్‌ సెంటరులో అడ్డుకున్నారు. ఒకింత భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిచారు. కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్‌ జెఎసి నాయకులను అరెస్టులు చేశారు. మహిళా కార్మికులను, మహిళా నాయకులను సైతం రోడ్డుపై ఈడ్చుకుంటూ అరెస్టుల పర్వాన్ని పాశవికంగా సాగించారు. దాదాపుగా 400 మంది మున్సిపల్‌ వర్కర్లను, సిపిఎం నాయకులు, కార్యకర్తలను వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. గాయపడినవారిని ప్రధమ చికిత్స నిమిత్తం గవర్నర్‌పేటలోని ప్రజా వైద్యశాలకు తరలించారు. 
పోలీసులు అరెస్టు చేసిన మున్సిపల్‌ కార్మికులు, జెఎసి, వామప పార్టీల నేతలను వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పరామర్శించారు.