మిర్చికి రూ.12 వేల ధర ప్రకటించాలి

క్వింటా మిర్చి కి రూ.12 వేలు, క్వింటా కందికి రూ.7,500 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. బుధవారం క్రోసూరులోని ఆమంచి భవనంలో సిపిఎం డివిజన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆవుల ఆంజనేయులు అధ్యక్షత వహించారు. జరిగింది. పాశం రామారావు మాట్లాడుతూ మిర్చి ఒక ఎకరం పండించడానికి 1.25 లక్షలు ఖర్చవుతుందని, దీనివల్ల ప్రభుత్వానికి పరోక్షంగా రూ.40 వేలు పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. సీజన్‌ ప్రారంభంలో రూ.12 వేలు ఉన్న మిర్చి క్వింటా ప్రస్తుతం రూ.ఏడు వేలకు పడిపోయింది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పప్పు ధాన్యాల వ్యవసాయం పెంచే పేరుతో కంది సాగు ఈ ఏడాది బాగా పెరిగిందని, గతంలో రూ.8 వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.4,500కు పడిపోయిందని అన్నారు. ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంవల్ల ధర పడిపోయిందని అందువల్ల రూ.7,500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేసారు. వ్యవసాయ కార్మికులకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, సి.ఎం. చంద్రబాబు నాయుడు ఇళ్ల స్ధలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయని విమర్శించారు.