మాస్టర్‌ప్లాన్‌పై ఇప్పటికీ సందేహమే..!!

మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కోసం గురువారం ఏర్పాటైన సదస్సులో రైతుల ప్రశ్నలకు మంత్రులుగాని, అధికారులుగాని సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో తమ భవిషత్తు ఏమిటో తెలియక రైతుల్లో అయోమయం ఏర్పడింది. సమీకరణలో భూములిచ్చిన వారికి కేటాయిస్తామన్న స్థలాలు ఇవ్వలేదు. కనీసం ఎక్కడ ఇస్తారో కూడా చెప్పటంలేదు. ఇంకా చర్చించాలంటున్నారు. ఇంతవరకు సిఆర్‌డిఎ మండల స్థాయి రికార్డుల ఆధారంగా సర్వే చేయలేదు. పూలింగులో ఇచ్చిన భూములు, రికార్డుల ప్రకారం ఉన్న భూముల వివరాల్లో ఏమైనా హెచ్చుతగ్గులుంటే ఈ సర్వేలో బయటపడతాయి. దీన్ని ఈ నెలలో చేపట్టాలని నిర్ణయించారు. గ్రామ కంఠాల సమస్యనూ పరిష్కరించలేదు. పూలింగు సమయంలో నిరంతరం గ్రామాల్లో తిరిగిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పుడు కనిపించడంలేదు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు దిగాలు పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు.