మార్క్సి‌స్టు‌ దృక్కోణం - కులం

దేశంలోని అనేక ఉన్నత విద్యా సంస్థలపై హిందూత్వ శక్తుల దాడుల నేపథ్యంలో కులం గురించి వామపక్ష మేధావుల్లో ఒక నూతన చర్చ మొదలైంది. కుల అణచివేత సమస్యను మార్క్సి స్టు దృక్పథంతో అర్థం చేసుకుంటున్న తీరును ఈ చర్చ మరోసారి ముందుకు తెచ్చింది. నేడు జరిగే పోరాటాలపై ఈ చర్చ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చు. అయితే ఇది సైద్ధాతిక ఎజెం డాలో భాగమైన విషయాన్ని కాదనలేము.
మార్క్సిజం 'కులం' కంటే 'వర్గం'కు ప్రాధాన్యతనిస్తుందని, కుల విభజన కంటే వర్గ విభజన ఆధారంగానే మార్క్సిజం సమాజాన్ని ప్రాథమికంగా అర్థం చేసుకుంటుం దని, తద్వారా కుల సమస్యకు తగిన ప్రాధాన్యతను ఇవ్వటం లేదని చాలామంది ముఖ్యంగా దళిత మేధావులు ఆరోపి స్తున్నారు. మూడు మేధో వైఖరులను ఈ చర్చలో మనం గమనించవచ్చు. మొదటిదాని ప్రకారం భారతదేశంలో కుల, వర్గ అణచివేతలు పాక్షికంగా ఆవరింబడి ఉంటాయి. అణచివేతకు గురవుతున్న కులాలు అణచివేతకు గురవుతున్న వర్గాలకు ఉపసముదాయాలుగా ఉండటమే కాక అవి ఆ వర్గంలో ప్రధాన భాగంగా ఉంటాయి. అందువల్లనే చాలా మంది రచయితలు పై విధంగా వాదిస్తూ దేశంలో జరు గుతున్న దోపిడీ ప్రక్రియను వర్ణించటానికి 'కులం-వర్గం' అనే ఏక పదబందాన్ని ఉపయోగిస్తుంటారు.
కులం, వర్గం భావనల మధ్య తేడాకు గల ప్రాధా న్యతను రెండవది వివరిస్తుంది. అయితే సమాజంలో మార్పును తెచ్చేందుకు కావలసిన రాజకీయ ప్రమేయంలో రెండింటిలో ఒకదానికి రెండవ దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు ఈ వైఖరి భావిస్తుంది. కొందరు వర్గ ప్రాతిపదికన నిర్వహించే పోరాటాలకు ప్రాధాన్యతనిస్తే, మరికొందరు కుల అణచివేతకు వ్యతిరేకంగా నిర్వహించే పోరాటాలకు ప్రాధాన్యతనిస్తారు. మూడవది ఫ్రెంచ్‌ మార్క్సిస్టు తత్వవేత్త లూయీ అల్థూజర్‌ ప్రతిపాదించిన 'నిర్మాణవాద మార్క్సిస్టు సిద్ధాంతం' చేత ఉత్తేజితమైన పద్ధతికి సంబంధించింది. అయితే అల్థూజర్‌ తన సిద్ధాంతాన్ని తీసుకువెళ్ళవలసినంత తీసుకువెళ్ళలేదని ఈ వైఖరి విమర్శిస్తుంది. దీని ప్రకారం ఏ కాలంలోనైనా సమాజంలో అనేక రకాల వైరుధ్యాలుంటాయి. ఒక వైరుధ్యం మరో వైరుధ్యం కంటే ప్రాధాన్యతగలదని చెప్పేందుకు వీలుపడదు. ఒక విశేష క్షణంలో వీటిలో ఏ వైరుధ్యమైనా ముందుకొచ్చే అవకాశముంటుంది. ప్రగతిశీల శక్తులు తమ శక్తియుక్తులను అలా ముందుకు వచ్చిన వైరుధ్యంపై కేంద్రీకరించవలసి ఉంటుంది. అలాంటి ఆచరణ ప్రక్రియతో ఒక సందిగ్ధ స్థితి ఉత్పన్నమవుతుందనీ, అలా సామాజిక నిర్మాణం మొత్తంగా పరివర్తన చెందేందుకు అవకాశం ఏర్పడుతుందని ఈ రచయితలు భావిస్తారు. ఈ చివరి వాదన చెప్పేదేమంటే కుల, వర్గ, లింగ సమస్యలు వివిధ కాలాలలో పోరాట క్షేత్రాలుగా ఆవిర్భవించే అవకాశం ఉంటుంది. ఏ క్షేత్రం ముందుకు వస్తే ఆ క్షేత్రంలో ప్రగతిశీల శక్తులు పోరాటాన్ని నిర్వహించవలసి ఉంటుంది. 'వర్గ వైరుధ్యం' ఇతర వైరుధ్యాలకన్నా విశిష్టతగలదని చెప్పే అవకాశం ఏ విధంగానూ ఇక్కడ ఉత్పన్నం కాదు.
అపరిపక్వ సమాజ దృష్టి
ఈ మూడు మేధో వైఖరులలో ఒక మౌలిక అంశం ఉమ్మడిగా ఉంటుంది. అదేమంటే వీరందరూ ఏ వైరుధ్యం ప్రధానమైనదనే విషయాన్ని చర్చిస్తున్నప్పుడు సమాజాన్ని అపరిపక్వంగా ఉన్నదనే దృష్టితో చూస్తారు. వేరే మాటల్లో చెప్పాలంటే ఘనీభవించిన చట్రంలో బిగించబడిన సమాజంలోని వైరుధ్యం సమస్యను వీరు చర్చిస్తారు. మొత్తంగా పరివర్తన చెందని సమాజంలో వివిధ కాలాలలో వివిధ వైరుధ్యాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయని చెప్పే ఈ చివరి మేధో వైఖరి కూడా సమాజాన్ని ఘనీభవిం చిన చట్రం దృక్కోణంలోనే చూస్తుంది. చూసీచూడగానే ఈ వైఖరి అలా లేదనిపిస్తుంది. ఎందుకంటే వివిధ కాలాలలో వివిధ వైరుధ్యాలు ప్రముఖంగా ముందుకొస్తాయని ఇది చెబుతుంది. ఇది ఘనీభవించిన చట్రంలోని సమాజాన్ని గురించి కాకుండా మారుతున్న సమాజాన్ని గురించి మాట్లాడుతుంది. సమాజానికి చెందిన ఒక ప్రత్యేకమైన ఘనీభవించిన చట్రంలో ఒక వైరుధ్యానికి సర్వోత్కృష్టత ఉంటుందని, అదేవిధంగా మరో ప్రత్యేకమైన ఘనీభవించిన చట్రంలో మరో వైరుధ్యం సర్వోత్కృష్టతను పొందే అవకాశం ఉంటుందని ఇది భావిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశంలో 'కుల', 'వర్గ' సమస్యలపై చర్చ ఘనీభవించిన సామాజిక చట్రంలో జరుగుతుంటుంది. ఈ ఘనీభవించిన సామాజిక చట్రంలో 'కుల' సమస్య కంటే 'వర్గ' సమస్యకు మార్క్సిజం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని పొరపాటుగా భావించటం జరుగుతున్నది. ఇది పొరపాటు అనటానికి గల కారణమేమంటే ఒక ఘనీభవించిన చట్రంలో ఒక కేటగిరీ భావం మరొక కేటగిరీ భావం కంటే ప్రాధాన్యతను కలిగివుంటుందని చెప్పటంతో మార్క్సిజానికి సంబంధం లేదు గనుక. ఒక చట్రం నుంచి మరో చట్రంలోకి మన ప్రస్థానం ఎలా జరుగుతుందనే విషయాన్ని మార్క్సిజం వివరిస్తుంది. వేరే విధంగా చెప్పాలంటే ఏ చట్రంలోనైనా కుల, వర్గ, లింగ సంబంధిత సంబంధాల, ఇతర సంబంధాల సముదాయం ఉంటుంది. ఈ సకల సముదాయాల సమస్తం అవుతుంది. ఈ సమస్తం లేక మనం చర్చిస్తున్న కుల-వర్గ సంబంధాల సముదాయం కాలక్రమంలో మారుతుంటుంది. ఇది ఎలా, ఎందుకు మారుతుంది అనే ప్రశ్నను మార్క్సిజం లేవనెత్తుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ సముదా యంలో ఏ అంశం స్వతహాగా లేక ఆంతర్యంలో ఎంత ముఖ్యమైనది అనే విషయానికి ప్రాముఖ్యత లేదు. అయితే ఈ సముదాయాన్ని ముందుకు నడిపించేది ఏమిటనేదే అసలు విషయం. ఈ ప్రశ్నకు మార్క్సిజం ఇచ్చే సమాధానం చారిత్రక భౌతికవాదానికి సంబంధించినదై ఉంటుంది. ప్రముఖ రష్యన్‌ మార్క్సిస్టు జివి ప్లెఖనోవ్‌ తన గ్రంథం 'ద డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ మోనిస్టు వ్యూ ఆఫ్‌ హిస్టరీ'లో చెప్పినట్టు చారిత్రక భౌతికవాదం మార్క్సిజం ప్రత్యేకత. పెట్టుబడిదారీ వ్యవస్థచే ప్రభావితమౌతున్న ప్రస్తుతాన్ని గురించి ఈ దృష్టి కోణం నుం చి చర్చించే ప్రయత్నం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషించటంపైనే మార్క్స్‌ తన జీవిత కాలాన్నంతా వెచ్చించాడు. ఈ వ్యవస్థకున్న యాదృచ్ఛిక స్వభావాన్ని ఆయన ఎత్తిచూపాడు. వాస్తవంలో ఈ వ్యవస్థకు యాదృచ్ఛికత ఉంటుంది. ఈ యాదృచ్ఛికత నిశ్చితమైన అంతర్భూత ధోరణులకు లోనవుతుంది. ఈ ధోరణులు మానవ ఇచ్ఛకు, చైతన్యానికి అనుగుణంగా ఉండ కుండా స్వతంత్రంగా ఉంటాయి(ఉదాహరణకు 1930వ దశకంలోని మహామాంద్యాన్ని ఎవరూ కోరుకోలేదు. అలాగే ప్రస్తుత ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం నుంచి బయట పడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కొనసాగుతూనే ఉన్నది). అంతేకాక ఈ అంతర్భూత ధోరణులు జనింపజేసే ప్రతిస్పందనలు మానవులు స్వీయబుద్ధితో చేస్తున్నవి కావు. పరిస్థితుల ప్రభావం వల్ల వారు అలా ప్రవర్తిస్తారు. ఎందు కంటే అలాచేయకపోతే ఆర్థిక వ్యవస్థలో వారు తమ స్థానాన్ని కోల్పోతారు. ఉదాహరణకు పెట్టుబడిని కూడబెట్టటం పెట్టుబడిదారులకు ఇష్టముండాలని ఏమీలేదు. కానీ అలా చేయకపోతే వారు వ్యవస్థలో తమ స్థానాన్ని కోల్పోతారు. పోటీకి తట్టుకోలేక వారు నాశనమై పోతారు. వేరేవిధంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు కూడా పరాయీకరణకు గురవుతారు. దీనినిబట్టి అర్థమయ్యే దేమంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న క్రమంలో కుల-వర్గ సమిష్టి సంబంధాల స్వభావం నిరం తరం మారుతూ ఉంటుంది. అయితే వ్యవస్థకున్న యాదృ చ్ఛిక స్వభావాన్ని అధిగమించకుండా మానవులు స్వేచ్ఛను సాధించటం దుస్సాధ్యం. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థనే అధిగమించాలి. అలా వ్యవస్థ రద్దు కావటం వర్గ దోపిడీకే కాకుండా కుల అణచివేతకు కూడా అవసరమౌతుంది. వ్యవస్థ రద్దుకాని స్థితిలో అణగారిన కులాలకు చెందిన కొందరు కార్మికవర్గ స్థాయి నుంచి బూర్జువా లేక వృత్తి నిపుణుల వంటి ఉన్నతవర్గ స్థాయికి 'ఎగబాక' గలుగుతారు. అయితే దాదాపుగా అణగారిన కులాలకు చెందినవారందరూ వర్గ దోపిడీలోనే కాకుండా కుల అణచివేతలో కూడా కూరుకు పోయి ఉన్నారన్న వాస్తవం మారదు.
పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించాల్సిన ఆవశ్యకత
ఈ వ్యవస్థలో వర్గ దోపిడీని అలానే కొనసాగ నిచ్చి, కుల అణచివేత అనే ఒక సజీవ వాస్తవికతకు బదులుగా కుల అణచివేతలేని మరో ప్రత్యామ్నాయ వాస్తవికతను సృష్టించటం సాధ్యపడదు. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించకుండా కుల అణచివేతను అంతం చేయటానికి పోరాటం చేస్తున్నవారు విజయం సాధించలేరు. క్లుప్తంగా చెప్పాలంటే కుల నిర్మూలన జరగాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అంతం కావలసివుంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించటంతోనే కుల అణచివేత అంతం కాదు అనేది నిజం. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించిన తరువాత స్థితి కుల అణచివేతను అంతం చేయటానికి చాలకపోయినప్పటికీ అది ఆవశ్యక స్థితిగా ఉంటుంది. ఇది మార్క్సిజం చేస్తున్న ప్రాథమిక నిర్ధారణ.
'కులం', 'వర్గం'లలో ఏ కేటగిరీ భావానికి ప్రాధాన్యత నివ్వాలనే విషయంపై చర్చ ఈ దృక్కోణం నుంచి జరగాలి. అంతేగానీ సమాజాన్ని అపరిపక్వమైందిగా భావించి ఈ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయటంవల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించటం కుల డిమాండ్‌గా ఉండజాలదు. అధిగమించవలసిన అవసరమున్న ఒక వ్యవస్థగా పెట్టుబడి దారీ విధానాన్ని గుర్తించటం, దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పడే వ్యవస్థకు సంబంధించిన భావనలు కుల సమస్య విశ్లేషణకు ఆవల ఉంటాయి. ఎవరైనా నిజాయితీగా, నిల కడగా కుల నిర్మూలన లక్ష్యాన్ని పట్టించుకుంటే వారు తప్పకుండా ఇటువంటి నిర్ధారణలకే వస్తారు. అలా చేస్తున్నప్పుడు కుల దృష్టికోణం పరిధిని దాటి వెళ్ళవలసి ఉంటుంది. వేరేవిధంగా చెప్పాలంటే ఎవరైనా కేవలం కుల దృష్టికోణం చట్రంలోనే ఇరుక్కుపోతే ఆ వ్యక్తి కుల అణచి వేతను అధిగమించటంలో కూడా విజయవంతం కాలేడు. వర్గ దృష్టికోణానికే ప్రాధాన్యతను ఇస్తుందనే ఆరోపణను మార్క్సిజం ఎదుర్కొంటున్నది. దీనికి కారణం వర్గ దోపిడీని అంతం చేయటానికే కాకుండా కుల, ఇతర రూపాలలోని అణచివేతలను కూడా అంతం చేయటానికి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించవలసి ఉంటుందనే అవగాహన మార్క్సిజానికి ఉండటమే. పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగ మించిన తరువాత కూడా కుల అణచివేత కనుమరుగవదు. అంటే కుల అణచివేత ప్రత్యేక స్వభావాన్ని కలిగివున్నదనీ, దానిని కేవలం వర్గ దోపిడీకి కుదించటం కుదరదనీ అర్థం. మన సమాజంలో కుల అణచివేత చాలా లోతుగా పాతుకు పోయింది. దానిని నిర్మూలించటం అటుంచి కనీసం పరిస్థి తిని మెరుగుపర్చటం కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలోగానీ, పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటానికి ముందుగానీ సాధ్యపడదు. అంతేకాక పెట్టుబడిదారీ వ్యవస్థ కూలిపోయిన తరువాత కూడా సుదీర్ఘ పోరాటాలు చేయకుండా కుల అణచివేతను నిర్మూలించటం సాధ్యపడదు. క్లుప్తంగా చెప్పా లంటే కుల అణచివేత మన సమాజంలో బాగా లోతుగా పాతుకుపోయింది. దీనిని అంత తేలిగ్గా అధిగమించటం సాధ్యం కాదు. అయితే కుల అణచివేతకు ప్రాధాన్యత నివ్వటం, దాని ప్రాముఖ్యతను, స్థిరత్వాన్నీ గుర్తించటం వేరు వేరు విషయాలు. కుల అణచివేతతోపాటు అన్ని రకాల అణచి వేతలనూ రూపుమాపటానికి పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగ మించవలసి ఉంటుందని భావించటం వల్లనే వర్గ పోరాటా నికీ, వర్గ వైరుధ్యానికీ మార్క్సిజం ప్రాధాన్యతనిస్తున్నది.
అయితే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే పోరాటానికి ప్రాధాన్యతనివ్వటమంటే కుల అణచివేతను విస్మరించమనిగానీ, దాన్ని సహాయక అంశంగా భావించ మనిగానీ చెప్పినట్టు కాదు. అంతేకాక కుల అణచివేత అంశాన్ని విస్మరించటం వల్ల పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలహీనపడుతుంటే ఆ పరిస్థితిని వర్గ పోరాటాన్ని ఎక్కువగా పట్టించుకోవటం వల్ల ఏర్పడిన స్థితిగా అర్థంచేసుకోకూడదు. వాస్తవంలో అది వర్గ పోరాటాన్ని బలహీనపరుస్తుంది. కుల అణచివేతతో సహా అన్ని రకాల అణచివేతలకూ వ్యతిరేకంగా జరిగే అన్ని పోరాటాలూ పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటమనే ప్రధాన లక్ష్యాన్ని విస్మరించకుండా ఉండేందుకే మార్క్సిజంలో 'వర్గం' అనే భావనకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాక అన్ని పోరాటాలూ ఆ అవసరంలో భాగంగా ఉండితీరాలని మార్క్సిజం చెబుతున్నది.

- ప్రభాత్‌ పట్నాయక్‌