మహోన్నతుల కోవలో సింహాద్రి శివారెడ్డి

పీడిత వర్గాల తరపున పోరాడే క్రమంలో ఆదర్శనీయ జీవితం గడిపిన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి వంటి మహోన్నతుల కోవలోకి సింహాద్రి శివారెడ్డి త్యాగమయ జీవితం చేరుతుందని, పేదల గుండెల్లో ఆయన కలకాలం నిలిచిపోతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. శనివారం మంగళగిరి మండలం కాజ గ్రామంలోని శివారెడ్డి నివాసం వద్ద మంగళగిరి డివిజన్‌ కార్యదర్శి జె.వి.రాఘవులు అధ్యక్షతన శివారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తనతోపాటు కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని కూడా పీడిత వర్గాల కోసం పని చేసే విధంగా తీర్చిదిద్దటం అత్యంత గొప్ప విషయమన్నారు. సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. అన్ని సామాజిక తరగతుల్ని సమానంగా చూసేవారన్నారు. కడలూరు జైల్లో 7 ఏళ్ల పాటు ఖైదు చేయబడ్డారన్నారు. మెనూ అమలు చేయాలని జరిగిన నిరాహార దీక్ష చేపడితే పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపటంతో 20 మంది ఉద్యమ నాయకులు చనిపోయారన్నారు. ఆ పోరాటంలో మోటూరు హనుమంతరావుతోపాటు, శివారెడ్డి పాల్గొన్నారని చెప్పారు. శక్తి సామర్థ్యాలకు మించి 70 ఏళ్ల పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో కొనసాగారని, ఎమర్జెన్సీ సమయంలో కమ్యూనిస్టులపై ఉక్కుపాదం మోపి చంపడానికి ప్రయత్నించినపుడు కూడా వెనకడుగు వేయలేదన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి కుటుంబానికి, ఈ గ్రామ ప్రతి కార్యకర్తకు సిపిఎం రుణపడి ఉందని చెప్పారు. ఆయన చూపిన బాటలో పార్టీ బోలోపేతానికి పునరంకిత మవుతామని స్పష్టంచేశారు.
సిపిఐ(ఎంఎల్‌) కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజరుకుమార్‌ మాట్లాడుతూ శివారెడ్డి తమకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారని, శ్రమతో ఉత్పత్తిచేసి కుటుంబం సాగాలని చెప్పటంతో చెప్పడంతో పాటు నడిపించిన ఘనత ఆయనదన్నారు. వర్గ బేధాలు వచ్చినపుడు ఎలా ఉండాలి, పేదలను ఎలా అనుసంధానం చేసుకోవాలి, వారిని ఎలా కలుపుకొని ఉద్యమంలోకి తీసుకెళ్ళాలి అని ఆలోచించారే తప్పా ఏనాడు ఇతర కమ్యూనిస్టు పార్టీలను నిందించలేదన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ పునఃనిర్మాణానికి వర్గ రాజ్యస్థాపనకు ఆయన చూపిన బాటలో తాము కొనసాగుతామని చెప్పారు.
నాగార్జున హాస్పటల్‌ ప్రముఖ వైద్యులు డాక్టర్‌ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ 1971 నుండి తమకు పరిచయం ఉండేదని, ఎవరు ఇంటికి వచ్చినా వారికి ఆతిథ్యం ఇవ్వకుండా వెళ్లనిచ్చేవారు కాదన్నారు. తాను జైలు జీవితం అనుభవించే క్రమంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయని అయినప్పటికీ ఆయన ఏనాడు వెనుదిరగకుండా పార్టీ నిర్మాణానికి చేసిన కృషి అభినందనీయం, ఆచరణీయమని పేర్కొన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు యోధుడిగా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి చివరివరకు నిలిచి అందరికీ ఆదర్శనీయులుగా ఉన్నారని పేర్కొన్నారు. విలాస జీవితాలు ఆశించకపోయినా అధికారదాహం వంటివి ఆయన దరిచేరలేదన్నారు. అటువంటి శివారెడ్డి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన అడుగు జాడల్లో కొనసాగుతామన్నారు.
ప్రజాశక్తి పూర్వ ఎడిటర్‌ తెలకపల్లి రవి మాట్లాడుతూ కమ్యూనిస్టు సింహంలా నిరాడంబరతను, నిబద్ధత, నిశ్చలత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి అని అన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉత్తమమైన గుణగణాలు కలిగినవారే ఎప్పుడూ ఉత్తేజాన్ని అందిస్తూనే ఉంటారని, అటువంటి ఉత్తేజానికి ప్రతిరూపంగా శివారెడ్డిగారు నిలిచారన్నారు. అటువంటి ఉత్తేజం కమ్యూనిస్టు కార్యకర్తలను నడిపించడానికి ఆ దోహదపడిందన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం కొంత బలహీనమైనప్పటికీ పూర్తిగా హీనమయ్యేది కాదని అన్నారు. సంకల్పం, సిద్ధాతం, సామ్యావాద పటిమ, శ్రమజీవులతో మమేకమయ్యేటటువంటి స్ఫూర్తి కలిగి చెక్కుచెదరని శివారెడ్డిలో ఎప్పుడు ఎటువంటి తడబాటు చూడలేదన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కుంగిపోకుండా చెక్కుచెదరని ఉక్కు సంకల్పాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి అమరావతిని భ్రమరావతిని మార్చే చాలామంది వస్తున్నపుడు దీన్ని అరుణావతిగా ఎలా చేయాలనేటువంటి ఒకానొక దీక్ష పూనాల్సిన సమయం వచ్చిందన్నారు. తన కుటుంబానికి కూడా కమ్యూనిస్టు ఉద్యమం వైపు నడిపించాలని నిరంతరం ఆలోచించారన్నారు. శివారెడ్డిగారి కుటుంబం తనకు ఎంతో సన్నిహితమైందన్నారు.
సిపిఐఎంఎల్‌ నాయకులు సింహాద్రి ఝాన్సి మాట్లాడుతూ తోటి కమ్యూనిస్టులను ఎలా ఆదరించాలో తెలిసిన వ్యక్తిగా తాను మహిళ అయినప్పటికీ ఉద్యమంలో కొనసాగించేందుకు ఏనాడు అడ్డుచెప్పకుండా ప్రోత్సహించేవారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రామనాథం పూర్ణచంద్రరావు మాట్లాడుతూ వ్యక్తి అభిప్రాయాలకంటే పార్టీ విధానాలకు కట్టుబడి నిలవాలంటూ గతంలో శివారెడ్డి సూచించిన తీరు తనతోపాటు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. నల్లమడ రైతు సంఘంనాయకులు కొల్లా రాజమోహన్‌ మాట్లాడుతూ శివారెడ్డికి ప్రజలంటే అమితమైన భక్తి....ఉద్యమాలంటే అమితమైన గౌరవం...మార్క్సిజం అంటే ఎనలేని ప్రేమ...చివరి వరకు కమ్యూనిస్టుగా నిలిపాయన్నారు. సిపిఐఎంఎల్‌ రెడ్‌స్టార్‌ రాష్ట్రనాయకులు హరిప్రసాద్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఐక్యతలో ఆయన చూపిన చొరవ తమకు ఆదర్శనీయంగా ఉందన్నారు. అటువంటి ఆయనకు విప్లవ జోహార్లు అర్పించారు. సిపిఎం నాయకులు, ప్రజాశక్తి ఎడిటర్‌ పాటూరి రామయ్య మాట్లాడుతూ 70ఏళ్ళ విప్లవజీవితంలో చిన్ననాటినుండి నేటి వరకు స్ఫూర్తిదాయకమైన ఘటనలు అనేకం అన్నారు. ఆయనతో నాకు 40ఏళ్ళ నుండి సాన్నిహిత్యం ఉందని అటువంటి ఆయన జీవితంనుండి నేనుకూడా ఎంతో నేర్చుకున్నానంటూ తెలియజేశారు. మార్క్సిజం పట్ల, లెనినిజం పట్ల, సోషలిజం పట్ల ఆయనకు ఎంతో విశ్వాసం ఉందని ఆ విశ్వాసమే ఆయనను కమ్యూనిస్టు పార్టీలో నిలబెట్టిందన్నారు. ఎన్నో కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడ్డారే కానీ వెనుకడుగు వేయలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలిపారు.
మాజీ సర్పంచ్‌, చిన్ననాటి స్నేహితులు ఈదా నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటినుండి తాము ఒకరికొకరుగా కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. తన కుటుంబాన్ని తన ఔన్నత్యాన్ని, తన ఆస్తిపాస్తులు పెరగాలని ఏనాడు ఆయన ఆశించలేదని చెప్పారు. సామాన్యుడిగా ప్రతి ఒక్కరిలో నిలిచారన్నారు. గ్రామంలో సంఘ సంస్కర్తగా కీర్తి గడించారని చెప్పారు. ఎల్లపుడూ గ్రామాభివృద్ది గురించి ఆలోచించేవారని తన ఆలోచన, తనపని, తన ప్రణాళిక ఎల్లప్పుడూ గ్రామం గురించే ఉండేవని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ఉన్నత కులంలో పుట్టినా ఎంతటి చదువును చదువుకున్నా విర్రవీగరాదని నిత్యం చెబుతూ ఉండేవారని అన్నారు. కులం, చదువు హోదాలు కంటే పేద ప్రజలకోసం నిలబడాలంటూ ఆయన సూచించిన తీరు స్ఫూర్తి దాయకమన్నారు. అటువంటి హృదయం నేడు ఆగిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కొందరు బతికి చచ్చిపోతారని కానీ శివారెడ్డి చచ్చిపోయినా ఆయన ప్రతి ఒక్కరి ఆలోచనలో బ్రతికేఉన్నారన్నారు. సిపిఎం సిఆర్‌డిఎ కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ సంస్కరణ ఉద్యమాలను గ్రామాలనుండి నడిపించిన మానవతావాది అన్నారు. సామాజిక న్యాయం కోసం చిన్ననాటినుండే పోరాడారని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అనుకూల దిశలోనూ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలిచిన తీరు అందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. నేడు పాలకులు కొత్త విధానాలతో కొత్త పద్ధతులతో భూములను కైంకర్యం చేసేందుకు వ్యవహరిస్తున్న తరుణంలో మరల ఎర్రజెండాను ముందుకు తీసుకువెళ్ళి పేద ప్రజల పక్షాన పోరాడటమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గసభ్యులు జొన్నా శివశంకర్‌, టిడిపి నాయకులు గాదె పిచ్చిరెడ్డిలు మాట్లాడుతూ వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలిపారు. ఈ సభలో సిపిఎం నాయకులు అన్నపరెడ్డి కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు, ఎస్‌.వెంకట్రావు, జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నాయకులు ఎన్‌.కాళిదాసు, వై.నేతాజి తదితరులు పాల్గొన్నారు.