మంత్రి తీరుపై సీపీఎం ఫైర్

పేదలకు ఉచితంగా సేవ చేయాలని వైద్యులకు సలహా ఇచ్చిన కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు వైద్యరంగం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పేదలకు సేవచేయాలని సలహా ఇచ్చిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రభుత్వం అందుకు విరుద్ధ్దంగా ఎందుకు పని చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పేదలకు వైద్యం అందించడం ప్రభుత్వం బాధ్యతని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం విజయనగరం జిల్లాకేంద్రంలో ఉన్న కేంద్రాసుపత్రిని ప్రైవేటు సంస్థకు అప్పజెప్పడం అశోక్‌గజపతిరాజు చెబుతున్న సిద్ధాంతానికి విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. అశోక్‌కు చెందిన మాన్సాస్‌సంస్థే ప్రభుత్వవైద్య కళాశాలను కైవసం చేసుకోవడంతోపాటు జిల్లా కేంద్రాసుపత్రిని కూడా తీసుకోవడం ఎంత వరకు సమంజసమో చెప్పాల న్నారు. అశోక్‌గజపతి రాజు తమ అధినేతకు చెప్పి విద్య, వైద్యం ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గేలా ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.