భూసేకరణను అడ్డుకుంటాం..

ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు మొండివైఖరిని కొనసాగిస్తే... ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా ప్రభుత్వ మెడలు వంచుతామని వామపక్షాలు హెచ్చరించాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్‌ మండలంలోని బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో భూసేకరణ నోటిఫికేషన్‌ ప్రకటించిన గ్రామాలైన మంగినపూడి, బుద్దాలపాలెం, గుండుపాలెంలో గురువారం సభలు నిర్వహించగా అందులో తొమ్మిది వామపక్ష అగ్రనేతలు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, భూ బ్యాంక్‌ పేరుతో ప్రతి జిల్లాలోనూ లక్షలాది ఎకరాలు సేకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగు లేస్తుండడంతో బాధితులందరినీ కూడగట్టడానికి వామ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. మంగినపూడిలో కొందరు భూస్వాములను అధికార పార్టీ ప్యాకేజీలతో ఆకట్టుకుందని, మిగిలిన గ్రామాల్లో కూడా ఇదే విధమైన ప్రలోభాలకు గురిచేసే అవకాశాలున్నాయని చెప్పారు.