భూములను కార్పొరేట్లకు కట్టబెట్టొద్దు..

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం చట్టాలను అపహాస్యం చేస్తూ అడ్డగోలుగా సాగు భూములను సేకరిస్తే ప్రతిఘటన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 30న విజయవాడలో రాష్ట్రస్థాయి రైతు సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో ప్రయివేటు కంపెనీలకు అప్పగించిన భూములను పరిశీలించిన అనంతరం సిపిఎం కర్నూలు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ బ్యాంకు పేరుతో భూములను సేకరించడం తగదన్నారు. కలెక్టర్లపై విచారణ చేపడితే రెవెన్యూ కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలను రాజధాని శంకుస్థాపనకు ముందుగానే ప్రధాని ప్రకటించకపోతే అన్ని రాజకీయ పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని స్తంభింపచేయాలని మధు విజ్ఞప్తి చేశారు.