భూదాహం వద్దు

భూదాహం వద్దు
దిష్టిబొమ్మ దహనంలో సిపిఎం నగర కార్యదర్శి కాశీనాథ్‌
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌
ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు భూములను కట్టబెడుతోందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని పైకిచెబుతున్నా, లోపల మాత్రం ప్రజల నుండి ఏవిధంగా భూములు లాక్కోవాలో అన్న ఆలోచనతోనే ముందుకు సాగుతోందన్నారు. మచిలీపట్నం భూపోరాటంపై ప్రభుత్వ నిర్బంధం నశించాలని, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పటమట ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ వద్ద ఆదివారం ఉదయం 'భూముల్ని తినే తోడేలు' దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్‌ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రజలను ఇబ్బందులు గురిచేయకుండా అవసరమైన మేరకే భూములు తీసుకోవాలన్నారు. లేకపోతే ఎటువంటి ఆందోళనకైనా సిద్దమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు, సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీదేవి, ముజఫర్‌ అహ్మద్‌, పటమట జోన్‌ నాయకులు బోజెడ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.