బిసి సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు

బిసి సబ్‌ ప్లాన్‌ అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ కె.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. పెదబొడ్డేపల్లి రామకోవెల వద్ద ఆదివారం జరిగిన డివిజన్‌ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో 50 శాతంపైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. నిర్థిష్ట, స్థిర ఆదాయాలు లేక దయనీయ పరిస్థితిని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తులు, వ్యవసాయం దెబ్బతినడంతో జీవనోపాధి కోల్పోయి దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారని వాపోయారు. 
    సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగం నిర్వీర్యమవుతుందని, ఈ నేపథ్యంలో ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కెజి నుండి పిజి వరకు విద్య ప్రయివేటు కావడంతో బిసిలకు విద్య అందని ద్రాక్షలాగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014-15 బడ్జెట్‌ లక్షా 11 వేల కోట్లలో బిసిలకు కేటాయించింది కేవలం రూ.3,130 కోట్లు, 2015-16లో లక్షా 18 వేల కోట్లలో రూ3,232 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో రూ.10 వేల కోట్లతో బిసి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించి దానిని ఆచరణలో అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. జిఒ 7ను విడుదల చేస్తూ 21 శాఖల వ్యయంతో 25 శాతం బిసిలకు ఖర్చు పెట్టాలని పేర్కొన్నారని, ఈ జిఒ పరిశీలిస్తే బిసిలకు సంబంధం లేని శాఖలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఓడ మల్లయ్య, ఎన్నికల తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా బిసిల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో సాధన కమిటీ జిల్లా కో-కన్వీనర్‌ గంట శ్రీరామ్‌, జిల్లా నాయకులు ఒనుం శ్రీనివాసరావు పాల్గొన్నారు.